సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
- కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
ప్రజాశక్తి – శ్రీకాకుళం
ప్రజలకు మెరుగైన సేవలందించడానికి అన్ని పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పలు శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌తో కలిసి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, గ్రామ సచివాలయం, డ్వామా, గృహ నిర్మాణం, పారిశుధ్యం, అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు వంటి అంశాలపై చర్చించారు. పల్లె పండుగ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పని దినాలను పెంచాలన్నారు. గృహ నిర్మాణాల పురోగతిని వేగవంతం చేయాలని చెప్పారు. కాలువలు, చెత్తకుప్పల శుభ్రతపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంద్ర సాధనకు కృషి చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరచాలని సూచించారు. కాలానుగుణ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. పిజిఆర్‌ఎస్ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. చెత్త నుంచి సంపద షెడ్ల నిర్మాణం పూర్తి చేయని 200 పంచాయతీలు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. రెవెన్యూ సదస్సులు, రీసర్వే ఫిర్యాదులు, ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ, ల్యాండ్ బ్యాంక్, కోర్టు కేసులు, వక్ఫ్ ఆస్తుల సర్వే వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. ఇంటి నుంచి పని, పి4 సర్వే, ఎంఎస్‌ఎంఇ సర్వే తదితర అంశాలపై ఆయా అధికారులు సమగ్ర వివరాలు అందించాలన్నారు. సమావేశంలో ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, జెడ్‌పి సిఇఒ శ్రీధర్ రాజా, సిపిఒ ప్రసన్నలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి భారతీ సౌజన్య, వ్యవసాయ శాఖ అధికారి కె.త్రినాథస్వామి, ఐసిడిఎస్ పీడీ బి.శాంతిశ్రీ, డ్వామా పీడీ సుధాకర్, ఇపిడిసిఎల్ ఎస్‌ఇ కృష్ణమూర్తి, హౌసింగ్ పీడీ నగేష్, జిల్లాలోని ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎంపిడిఒలు, జిల్లా, మండలస్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.