మాట్లాడుతున్న మహాలక్ష్మి
ప్రజాశక్తి- లావేరు
మహిళలపై పనిప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని ఎపి శ్రామిక మహిళా జిల్లా కో-కన్వీనర్ అల్లు మహాలక్ష్మి, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్.వి.రమణ డిమాండ్ చేశారు. మహిళ దినోత్సవం సందర్భంగా లావేరులో మహిళలపై ‘పనిప్రదేశాల్లో లైంగిక వేధింపులు-ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు’ అనే అంశంపై సదస్సును నిర్వహించారు. అంగన్వాడీ జిల్లా సినీయర్ నాయకులు కె.సుజాత, మధ్యాహ్నన భోజన కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ఉత్తర అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలపై వేధింపులను అరికట్టేందుకు చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. లైంగిక వేధింపుల నిరోధక కమిటీలను ఏర్పాటు చేసి జిల్లా కో-అధికార్లను నియమించాలన్నారు. సినిమాల్లో, టివి సిరియల్లో అశ్లీలతలను విచ్చలవిడిగా ప్రదర్శిస్తున్నారని, వాటి ప్రభావం సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతోందని దుయ్యబట్టారు. మహిళలు, పసిపిల్లలపై జరుగుతున్న హింసను అరికట్టాలని డిమాండ్ చేశారు. అందరికీ ఉపాధి కల్పించాలని, గౌరవంగా జీవించే అవకాశాలు కల్పించాలని కోరారు. కమిటీ కనీస వేతనాలు ఇవ్వాలని, మహిళా ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశా, అంగన్వాడీ తదితర స్కీమ్ వర్కర్స్‌ను రెగ్యులర్ చేయాలన్నారు. పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలన్నారు. ధరలను అదుపు చేయాలన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు ఎల్.లక్ష్మి, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మిక సంఘాం నాయకులు పి.దేవి, యు.వజ్రవమ్మ, టి.శ్యామల, ఎన్.కుమారి, కె.సుర్యకూమారి, యు.సుజాత, ఇ.కళావతి, ఎల్.అప్పచ్చమ్మ, వై.కృష్ణవేణి, టి.సత్యవతి, గౌరీశ్వరి, టి.సత్యవతి, ఎ.కోందడమ్మ పాల్గొన్నారు.