పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్‌ విండో అనుమతులు

పారిశ్రామికంగా జిల్లా

మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • పెండింగ్‌ ఫిర్యాదులను పరిష్కరించాలి
  • కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధి చెందడానికి వీలుగా ప్రభుత్వ అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహంపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగిల్‌ డెస్క్‌ విండోకు సంబంధించి పెండింగ్‌ దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎం విజయరత్నం మాట్లాడుతూ 15 దరఖాస్తులు రాగా, 13 ప్రాసెస్‌లో ఉన్నాయని వివరించారు. పిఎంఇజిపిలో 69 లక్ష్యం కాగా 90 అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. పిఎం విశ్వకర్మ పథకం ద్వారా 6,599 మందికి అనుమతులు ఇచ్చామని, వారిలో 5,884 మందికి శిక్షణ పూర్తి చేశామన్నారు. సమావేశంలో పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఇఇ కరుణ శ్రీ, ఎపిఐఐసి జెడ్‌ఎం ఎం.మురళీ మోహనరావు, అగ్నిమాపక శాఖ అధికారి మోహనరావు, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ వి.రాంబాబు, ఎడి రఘునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్‌ ఫిర్యాదులను పరిష్కరించాలి

రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పలు శాఖల అధికారులతో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌తో కలిసి కలెక్టరేట్‌ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులు, రీసర్వే ఫిర్యాదులు, ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ, ల్యాండ్‌ బ్యాంకు, కోర్టు కేసులు, వక్ఫ్‌ ఆస్తుల సర్వే వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. రైతులు ఎటువంటి ఇబ్బందులకు గురికాకూడదని స్పష్టం చేశారు. నిర్దేశించిన, పూర్తి చేసిన గోకులాలపై ఆరా తీశారు. రానున్న రెండు రోజుల్లో వాటిని సైతం వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. మార్కెటింగ్‌, మత్స్య, ఉద్యాన, పరిశ్రమలు, గృహనిర్మాణ శాఖల లక్ష్యాలపై దృష్టిసారించాలన్నారు. వేసవిలో వసతిగృహాల భవనాల మరమ్మతులు చేపట్టాలన్నారు. ఎంపిడిఒలు గృహ నిర్మాణాలకు సంబంధించి అర్హత కలిగిన లబ్ధిదారులకు మాత్రమే లబ్ధి చేకూరేలా చూడాలని, ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని సూచించారు. పిఎం సూర్యఘర్‌పై విస్తృత ప్రచారం చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఉపాధి హామీ పనుల్లో వేగం పెంచాలని, పెండింగ్‌ బిల్లులను చెల్లించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, ప్రత్యేక ఉప కలెక్టర్‌ పద్మావతి, జెడ్‌పి సిఇఒ శ్రీధర్‌ రాజా, సిపిఒ ప్రసన్నలక్ష్మి, టెక్కలి ఆర్‌డిఒ కృష్ణమూర్తి, ఐసిడిఎస్‌, డ్వామా, హౌసింగ్‌ పీడీలు బి.శాంతిశ్రీ, సుధాకర్‌, నగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️