సీతారాం ఏచూరి గొప్ప దార్శనికుడు

కమ్యూనిస్టు ఉద్యమ సారథి సీతారాం

ఏచూరి చిత్రపటానికి నివాళ్లర్పిస్తున్న నాయకులు

సంస్మరణ సభలో కొనియాడిన వక్తలు

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

కమ్యూనిస్టు ఉద్యమ సారథి సీతారాం ఏచూరి గొప్ప దార్శనికుడని పలువురు వక్తలు కొనియాడారు. నగరంలోని బాపూజీ కళామందిర్‌లో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి అధ్యక్షతన సీతారాం ఏచూరి సంస్మరణ సభను ఆదివారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌ మాట్లాడుతూ విభజనతో నష్టపోయిన ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరముందని నాడు రాజ్యసభలో గట్టిగా తన వాణి వినిపించారని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారని, వాటి అభివృద్ధి కోసం పరితపించారని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా, నేటికీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు. సైద్ధాంతికంగా విరుద్ధమైన భావజాలం కలిగిన మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బిజెపి జాతీయాధ్యక్షుడు జెపి నడ్డా సైతం ఏచూరి మరణంపై బాధపడ్డారంటే అంతటి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఏచూరి అని కొనియాడారు. వ్యక్తిగా కంటే సిపిఎం కార్యకర్తగా, నాయకునిగా ఆయన ఇది సాధించగలిగారని చెప్పారు. ఢిల్లీలోని జెఎన్‌టియులో చేరిన తర్వాత ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడిగా పరిపూర్ణమైన నాయకత్వం వహించడం వల్లే ఏచూరి ఈ స్థాయికి చేరుకున్నారని విద్యార్థులు, యువత దీన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మతతత్వ శక్తులు, పెట్టుబడిదారుల బంధాన్ని విడగొట్టేందుకు ఐక్యంగా పనిచేయడమే ఏచూరికి ఇచ్చే ఘన నివాళి అని అన్నారు. ఏచూరి ఆశించిన దేశ సార్వభౌమత్వం, ఫెడరలిజం, సామాజిక న్యాయం, లౌకికవాదం పరిరక్షణ కోసం ప్రజాతంత్ర, లౌకిక శక్తులతో కలిసి ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. మత ఘర్షణలను అణచివేసి మతసామరస్యం, వాటి సంప్రదాయాలను నాడు ఎన్‌టిఆర్‌ గౌరవించారని, మైనార్టీల పక్షాన నాడు వైఎస్సార్‌ నిలబడ్డారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు చంద్రబాబు, జగన్‌ పార్టీలు మతతత్వ శక్తులకు ఊతమిచ్చేలా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. తిరుమల లడ్డూ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు సిట్‌ విచారణ చేస్తోందని, మరోవైపు సుప్రీం కోర్టు కూడా విచారించనుందని తొందరపాటు ఎందుకని ప్రశ్నించారు. ఈ నెపంతో టిటిడిని హైజాక్‌ చేసి తన ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తోందని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం ఉపయోగపడే టిటిడిని తరలించే కుట్రలు, కుతంత్రాలను గమనించి వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకులు పేడాడ పరమేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక, విదేశీ విధానాలు దేశానికి ఏవిధంగా నష్టం కలిగిస్తాయో ముందుగానే హెచ్చరించిన దార్శనికుడు ఏచూరి అని కొనియాడారు. పార్టీ సిద్ధాంతాలకు లోబడే రాజకీయ పక్షాల నాయకులతో సన్నిహిత సంబంధాలు నెరపారని చెప్పారు.జనసేన జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్‌ మాట్లాడుతూ సీతారాం ఏచూరి దేశంలో ఉన్న సామాజిక అంతరాలపై అలుపెరుగని పోరాటం చేశారని కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే కర్తవ్యాన్ని యువత తీసుకోవాలన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకట రమణ మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం ప్రమాదంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏచూరి మరణించడం దేశానికి తీరని లోటన్నారు.సిపిఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ జిల్లా కార్యదర్శి తామాడ సన్యాసిరావు మాట్లాడుతూ కార్మికవర్గం, పీడిత ప్రజానీకం కోసం పనిచేసిన ఏచూరి మరణం బాధాకరమన్నారు. మతోన్మాదం, ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తుల నుంచి దేశాన్ని రక్షించుకోవాలంటే అంతా ఐక్యంగా పోరాడాల్సిన అవసరముందన్నారు. సిపిఐ(ఎంఎల్‌) నాయకులు తాండ్ర అరుణ మాట్లాడుతూ ఏచూరి ఆశయాలను నెరవేర్చేందుకు అంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ జిల్లాలో రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ కార్మికుల సమ్మె సందర్భంగా జిల్లాకు వచ్చి ఆయన సంఘీభావం ప్రకటించిన 24 గంటల్లో సమస్య పరిష్కారమైందన్నారు. శ్రమజీవుల పక్షాన ఏవిధంగా నిలబడతారో ఇది ఒక ఉదాహరణ అని చెప్పారు.సిపిఐ (ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు పీడిత వర్గాల తరుపున పోరాడిన వారిలో ఏచూరి చురుకైన పాత్ర పోషించారని చెప్పారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి మాట్లాడుతూ పీడిత ప్రజలు, కార్మికవర్గానికి తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప నేత ఏచూరి అని కొనియాడారు. ఉపాధి చట్టం, అటవీహక్కుల చట్టం, సమాచార హక్కు చట్టం తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌ సంతాప సందేశాన్ని జిల్లా ఉపాధ్యక్షులు రౌతు శంకరరావు వినిపించారు. ప్రజా నాట్యమండలి కళాకారులు సిహెచ్‌.రామచంద్రరావు, ఎస్‌.శ్రీనివాసులు ఏచూరిని స్మరిస్తూ గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా ఏచూరి జీవిత చరిత్రపై ప్రచురించిన ప్రత్యేక సంచికను వక్తలు ఆవిష్కరించారు.

 

➡️