ప్రజాశక్తి – టెక్కలి
ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులకు సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యాన నడుస్తున్న పాఠశాలల సముదాయాల్ని మార్చాలన్న విద్యాశాఖ ఉద్దేశం మేరకు మండలంలోని పాఠశాలల సముదాయాల సంఖ్యను కుదించారు. టెక్కలి మండలంలో పది ఉన్నత పాఠశాలలను ఆరు పాఠశాలల సముదాయాల క్లస్టర్లుగా గుర్తించారు. మండలంలోని నర్సింగపల్లి, సీతాపురం, చాకిపల్లి, రావివలస జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలతో పాటు పట్టణంలోని జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలిపి ఆరు క్లస్టర్లుగా గుర్తించారు. గుర్తించిన పాఠశాలల్లో సముదాయాలకు అనుకూలంగా ఉన్న వసతుల మేరకు క్లస్టర్లను గుర్తించినా, విద్యాశాఖ నిబంధనల మేరకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయా? లేవా? అనే దానిపై కమిటీ పర్యవేక్షించి నివేదిక ఆందజేయనుంది. కమిటీలో మండల విద్యాశాఖాధికారితో పాటు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, క్లస్టర్‌గా గుర్తింపు పొందిన పాఠశాల ఉన్న ప్రదేశంలో ఉన్న సర్పంచ్, ఆయా పాఠశాలల విద్యా కమిటీ చైర్మన్లతో కూడిన కమిటీ క్లస్టర్లను పర్యవేక్షించి పరిశీలించనుంది. ఈమేరకు వారు ఇచ్చిన నివేదిక మేరకు క్లస్టర్‌ను కొనసాగించాలా? మార్చాలా? అనే నిర్ణయం కమిటీ నిర్ణయించనుంది. ప్రస్తుతానికి గుర్తించిన క్లస్టర్లు పట్టణ కేంద్రానికి ఆనుకూలంగా సమీపంలో ఉన్న పాఠశాలలు ఉండడంతో వాటినే వినియోగించవచ్చని పలువురు భావిస్తున్నారు.