పారిశుధ్య పనులను పరిశీలిస్తున్న కమిషనర్ ఓబులేసు
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
వర్షాకాలం నేపథ్యంలో నగర ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు కోరారు. నగరంలోని ఎల్‌బిఎస్ కాలనీ, పద్మావతి నగర్, నీలమ్మకాలనీ, తోటపాలెం రోడ్డు, గుజరాతీపేట, నవభారత్ జంక్షన్ తదితర ప్రాంతాల్లో బుధవారం పర్యటించారు. పారిశుధ్య నిర్వహణతో పాటు కాలువల్లో పూడికతీత పనులను పరిశీలించారు. స్థానికులతో ఆయన మాట్లాడుతూ చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా వీథుల్లోకి వస్తున్న వాహనాలకు అందించాలన్నారు. రోడ్లపై చెత్త వేయడం వల్ల గాలికి ఎగిరి తిరిగి కాలువల్లో పడుతోందని, చెత్తతో కాలువలు నిండిపోవడం వల్ల నీరు నిల్వ ఉంటోందన్నారు. కాలువల్లో మురుగును ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని పారిశుధ్య కార్మికులను ఆదేశించారు. ప్రజల్లో అవగాహన కల్పించి చెత్తను రోడ్లపై వేయకుండా చూడాలన్నారు. వర్షాలు కురుస్తుండడంతో వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయన్నారు. కాచి వడపోసిన నీటిని తాగాలని, వేడి ఆహార పదార్థాలను తినాలన్నారు. ఆయన వెంట ప్రజారోగ్య అధికారి వెంకటరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.