మాట్లాడుతున్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
- కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
ప్రజాశక్తి – శ్రీకాకుళం
జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి, పరిపాలనాపరమైన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌తో కలిసి మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో భూ పరిపాలన, తాగునీటి సరఫరా, ఐసిడిఎస్, గ్రామ సచివాలయాల పనితీరు వంటి కీలక అంశాలపై సమీక్షించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ఫిర్యాదుల పరిశీలనను ప్రామాణికంగా డివిజన్ల స్థాయిలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఆక్రమణల క్రమబద్ధీకరణ, ఇళ్ల స్థలాల పున: పరిశీలన, ప్రాథమిక గ్రామాల పున: సర్వే, ప్రభుత్వ భూముల వివరాలు, నీటి పన్ను వసూళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, జిల్లా ప్రణాళికాధికారి, గ్రామీణ నీటిపారుదల అధికారుల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. పల్లె పండగ అభివృద్ధి కార్యక్రమాల్లో మెటీరియల్ కాంపోనెంట్ వినియోగాన్ని గ్రామస్థాయి ఇంజినీర్లు, సహాయ ఇంజినీర్ల వద్దే పర్యవేక్షించాలన్నారు. పిఎం సూర్యఘర్ యోజన పథకంలో బ్యాంకులు, కాంట్రాక్టర్ల వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమగ్ర శిశు అభివృద్ధి కేంద్రాల్లో మరుగుదొడ్లు, విద్యుత్, తాగునీటి వసతులు అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు. గ్రామ సచివాలయ వ్యవస్థలో కొత్త విధానాలను అమలు చేయడంలో ఉద్యోగుల హాజరు, సర్వేలు ముఖ్యమన్నారు. పరిశుభ్రతపై, ప్రత్యేకించి ఘన వ్యర్థాల నిర్వహణలో ప్రమేయం ఉన్న కమిటీల పనితీరు పర్యవేక్షించాలన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార స్థితిగతులు, పరిష్కరించిన ఫిర్యాదుల పరిశీలన, ఆంధ్రప్రదేశ్ సేవ, మీసేవ దరఖాస్తులపై సమీక్షించారు. సమావేశంలో ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, జెడ్‌పి సిఇఒ శ్రీధర్ రాజా, డిపిఒ భారతి సౌజన్య, వ్యవసాయ శాఖ అధికారి కె.త్రినాథస్వామి, ఐసిడిఎస్ పీడీ బి.శాంతిశ్రీ, డ్వామా పీడీ సుధాకర్, జిల్లాలోని ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎంపిడిఒలు, జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.