వినతులను స్వీకరిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు
వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు
ప్రజాశక్తి- కోటబొమ్మాళి
జిల్లాలోని ప్రతి రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. స్థానిక ఎన్‌టిఆర్ కార్యాలయంలో రాష్ట్ర ఉన్నతాధికారులతో శనివారం ఫోన్‌లో మాట్లాడారు. సాంకేతిక సమస్యలు ఉంటే త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అవసరమైన ట్రాక్ షీట్లు అందించాలని ఆదేశించారు. రైతులు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. రైతు ఇంట పండగ వాతావరణం కల్పించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. రైతు ధాన్యం అమ్మిన నాలుగు గంటల్లోనే వారి ఖాతాలో జమ చేస్తున్నామని అన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రీతిలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. ప్రధానంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని వినతులు వచ్చాయి. నూతన గృహాలు మంజూరు చేయాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు అందాయని, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే నిమ్మాడ మంత్రి క్యాంప్ కార్యాలయంలో డిఎంహెచ్‌ఒ డాక్టర్ టి.వి.బాలమురళి మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో కింజరాపు హరివర ప్రసాద్, ఎల్.ఎల్.నాయుడు, బగాది శేషు పాల్గొన్నారు.