కేరళ ప్రజలకు అండగా నిలవాలి

కేరళ ప్రజలకు అండగా

మాట్లాడుతున్న సిఐటియు సీనియర్‌ నాయకులు శ్రీనివాసు

ప్రజాశక్తి – శ్రీకాకుళం

కేరళ ప్రజలకు అండగా నిలవాలని సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కోరారు. కేరళ ప్రజల హక్కులు పరిరక్షించాలి, ప్రత్యామ్నాయ వామపక్షాలను బలోపేతం చేయాలనే నినాదంతో నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆ సంఘ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు అధ్యక్షతన సిఐటియు, అఖిల భారత కిసాన్‌ సభ, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన కేరళ సంఘీభావ సభను బుధవారం నిర్వహించారు. ఈ సభలో సిఐటియు జిలా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి, ఎపి రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.మోహనరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సిర్ల ప్రసాద్‌, సిఐటియు సీనియర్‌ నాయకులు కె.శ్రీనివాసు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బిజెపియేతర రాష్ట్ర ప్రభుత్వాలపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. కేరళలోని సిపిఎం నాయకత్వాన వామపక్ష ప్రభుత్వానికి అనేక ఆటంకాలు, అడ్డంకులు కల్పించిందని తెలిపారు. కేరళ ప్రభుత్వంపై కక్షగట్టి రూ.లక్ష కోట్లకు పైగా రావాల్సిన న్యాయమైన వాటా ఇవ్వకుండా, ఆ రాష్ట్ర అభివృద్ధిని అస్థిరపరిచేందుకు కుయుక్తులు పన్నుతోందన్నారు. అక్షరాస్యతలో, మహిళా సాధికారత, విద్య, వైద్యరంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి, స్థానిక సంస్థలకు విధులు, నిధులు వికేంద్రీకరించి సుపరిపాలన అందించడంలో దేశంలో అగ్రస్థానంలో పయనిస్తున్న రాష్ట్రం కేరళ అని చెప్పారు. ప్రజానుకూల విధానాలను వామపక్ష ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం గవర్నర్‌ను అడ్డం పెట్టుకుని అసెంబ్లీ పాస్‌ చేసిన బిల్లులను తొక్కిపెడుతోందని విమర్శించారు. రాజ్యాంగంలోని ఫెడరల్‌ స్ఫూర్తికి కేంద్ర ప్రభుత్వం విఘాతం కల్పిస్తోందన్నారు. ఆ రాష్ట్రంలో సహకార రంగాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని భారత పెట్రోలియం వంటి భారీ పరిశ్రమలను అమ్మడానికి పూనుకుందన్నారు. త్రివేండ్రం విమానాశ్రయాన్ని అదానీకి అప్పగించిందని, రాష్ట్ర ప్రభుత్వమే కొంటామన్నా నిరాకరించిందని గుర్తుచేశారు. వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడి 400 మంది మృతి చెందారని, మరో వంద మంది ఆచూకీ నేటికీ లభ్యం కాలేదన్నారు. ఇటువంటి తీవ్రమైన దుర్ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించకుండా దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు. కేరళలో కనీస వేతనం రోజుకు రూ.600 అయినా, రోజుకు అత్యధిక మంది కార్మికులకు రూ.వెయ్యికి పైగా లభిస్తుందన్నారు. రాష్ట్రంలో 30 రకాల సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేసి అన్నిరంగాల కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. 13 రకాల నిత్యావసర సరుకులు ప్రజలకు అతి తక్కువ ధరకు అందిస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతిఒక్కరికీ సొంత ఇంటిని వామపక్ష ప్రభుత్వ హయాంలో కల్పించిందన్నారు. దేశంలోనే రైతులకు అత్యధిక గిట్టుబాటు ధర అందిస్తున్న రాష్ట్రం కేరళ అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత చర్యలు విడనాడి చట్ట ప్రకారం రావాల్సిన హక్కులు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సభలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు అల్లు మహాలక్ష్మి, కె.సూరయ్య, జిల్లా కార్యదర్శి ఎన్‌.వి రమణ నాయకులు కె.గోపి, టి.ప్రవీణ ఎల్‌.రామప్పడు పాల్గొన్నారు.

➡️