ప్రభుత్వ విద్య బలోపేతం

ప్రభుత్వ విద్య బలోపేతానికి
  • మెరుగైన బోధనతో ఉత్తమ ఫలితాలు
  • అందుబాటులోకి పాఠ్య పుస్తకాలు
  • జిల్లా విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ప్రభుత్వ విద్య బలోపేతానికి మరింత కృషి చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈనెల 12 నుంచి కొత్త విద్యా సంవత్సరం ఆరంభమవుతున్న నేపథ్యంలో తరగతుల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు అందుబాటులోకి రావడం, మెరుగైన విద్యా విధానం వల్ల విద్యార్థుల చేరిక సంఖ్య పెరుగుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్య అందుతోందని చెప్పారు. మెరుగైన బోధనతో గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలను సాధించినట్లు తెలిపారు. పలు అంశాలపై ‘ప్రజాశక్తి’ ముఖాముఖిలో వెల్లడించారు.

ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ విద్య బలోపేతానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?

పాఠశాల విద్యలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెరుగుతున్నాయి.డ్రాపౌట్స్‌ లేకుండా విద్యార్థులను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలున్నాయి. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో కార్పొరేట్‌కు ధీటుగా ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యా బోధన ఉంటోంది. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేలా బోధన సాగుతుంది.

పాఠ్య పుస్తకాల సరఫరా ఎంతమేరకు పూర్తి చేశారు?

వేసవి సెలవుల అనంతరం పాఠశాలు పున: ప్రారంభం నాటికి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందేలా ఏర్పాట్లు చేశాం. జిల్లాలో గతేడాది మే చివరి నాటికి పాఠ్య పుస్తకాలు 80 శాతం పైగా చేరగా మండలాలకు పంపించడం పూర్తయింది. ఈసారి జూన్‌ మొదటి వారానికి 70 శాతం పాఠ్య పుస్తకాల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. ఏటా ఒకటి నుంచి పదో తరగతి వరకు పుస్తకాల ఇండెంట్‌ను జిల్లాస్థాయి పాఠ్య పుస్తకాల మేనేజరు నుంచి సంబంధిత పబ్లిషర్‌కు పంపేవారు. అలాకాకుండా ఒకటి నుంచి ఏడో తరగతి వరకు మాత్రమే ఇండెంట్‌ పంపారు. 8 నుంచి 10వ తరగతి వరకు ఆయా మండలాల నుంచి వివరాలు సేకరించి నేరుగా పంపించడం జరుగుతోంది.

విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పాఠ్య పుస్తకాలన్నీ అందిస్తారా?

జిల్లాలోని 30 మండలాల్లో ప్రభుత్వ బడుల్లో ఎనిమిది నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు 66,902 మంది ఉన్నారు. ఈ ఏడాది నుంచి సిబిఎస్‌ఇ సిలబస్‌ అమలు చేయాల్సి ఉంది. ఆ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను నేరుగా మండల కేంద్రాలకు పంపిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు 1,18,022 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికిగానూ 7,37,662 పుస్తకాలు అవసరం కాగా, ప్రస్తుతం జిల్లాకు 3.20 లక్షల పుస్తకాలు చేరాయి. వీటితో పాటు గతంలో మిగిలిన పుస్తకాలు 1,10,737 ఉండడంతో ఇంకా సగానికి పైగా రాలేదు. జిల్లా నుంచి మొత్తం 6,95,984 ప్రింట్‌ ఆర్డర్‌ ఇచ్చాం. దశల వారీగా వస్తున్నాయి.

మెగా డిఎస్‌సిని ప్రభుత్వం ప్రకటించే అవకాశమున్న నేపథ్యంలో జిల్లాలో ఖాళీల పరిస్థితి ఎలా ఉంది?

జిల్లావ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థుల విలీన ప్రక్రియ గతంలో చేపట్టాం. దీనివల్ల జిల్లాలో అనేక పాఠశాలలు సర్దుబాటు అయ్యాయి. కొన్నిచోట్ల విలీన ప్రక్రియ వల్ల పాఠశాలల పునరుద్ధరణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రేషనలైజేషన్‌ వల్ల కొన్నిచోట్ల ఖాళీలను పూరించడమైంది. ప్రభుత్వ మార్గ దర్శకాలకు అనుగుణంగా ఖాళీలను గుర్తించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలను అనుసరించి ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను గుర్తించనున్నాం.

మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు తీసుకుంటున్న చర్యలు ఏమిటి?

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషకాహారంతో కూడిన భోజనాన్ని మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందిస్తున్నాం. మూడు మండలాలు మినహా అన్ని ప్రాంతాల్లో పాఠశాల స్థాయిలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు భోజనం వండుతున్నారు. మూడు మండలాల్లో అక్షయ ఫౌండేషన్‌ సరఫరా చేస్తోంది. మధ్యాహ్న భోజన వంట కార్మికులకు శిక్షణా కార్యక్రమాలనూ నిర్వహించాం.

➡️