ధర్నా చేస్తున్న పిఎసిఎస్ ఉద్యోగులు
డిసిసిబి వద్ద పిఎసిఎస్ ఉద్యోగుల ధర్నా
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
ప్రాథమిక సహకార పరపతి సంఘాల ఉద్యోగుల సమస్యలను వచ్చే నెల పదో తేదీ లోగా పరిష్కరించకుంటే సమ్మె తప్పదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, పిఎసిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గిరిబుచ్చి రంగనాథ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉద్యోగ భధ్రత, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ పిఎసిఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యాన పిఎసిఎస్ ఉద్యోగులు నగరంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిఎసిఎస్‌ల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 2019 పిఆర్‌సి అమలు చేయాలన్నారు. ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ జిఒ ఇవ్వాలని, రిటైర్ అయిన ఉద్యోగికి గ్రాట్యుటీ రూ.20లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2019 తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘ ఉద్యోగులకు జిఒ నంబరు 36ను అనుసరించి హెచ్‌ఆర్ పాలసీతో కూడిన పిఆర్‌సి అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై గత ప్రభుత్వాన్ని పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని, నాడు జిఒ ఇచ్చిన ప్రభుత్వమే నేడు అధికారంలో ఉన్నందున అమలు చేయాలని కోరారు. ఈ సమస్యపై ఇప్పటికే రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడికి విన్నవించుకున్నా నేటికీ అమలు చేయలేదన్నారు. సహకార శాఖ కమిషనర్ ఎ.బాబు కంప్యూటరీకరణలో భాగంగా డిసిటి, ప్రీ మైగ్రేషన్ చేస్తే సమస్యలు పరిష్కరిస్తామని హామీనిచ్చారని గుర్తు చేశారు. ఆయన ఆదేశాల మేరకు రాత్రింబవళ్లు పనిచేసి రాష్ట్రవ్యాప్తంగా పూర్తి చేశామని, ఇచ్చిన హామీ నెలలు గడుస్తున్నా అమలు చేయడం లేదని విమర్శించారు. సహకార సంఘాలను ఆదాయ పన్ను పరిధి నుంచి తప్పించాలని కోరారు. ఇప్పటికైనా సమస్యలను పరిష్కరించి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. ధర్నా అనంతరం డిసిసిబి సిఇఒ డి.వరప్రసాదరావును కలిసి వినతిపత్రం అందజేశారు. ధర్నాలో పిఎసిఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు లోలుగు మోహనరావు, ప్రధాన కార్యదర్శి బి.రామారావు, ఉప ప్రధాన కార్యదర్శి ఎ.పాపినాయుడు, కోశాధికారి కె.లక్ష్మీనారాయణ, కన్వీనర్ బి.సన్యాసిరావు, ఉపాధ్యక్షులు ఎ.జగదీష్, తదితరులు పాల్గొన్నారు.