మాట్లాడుతున్న ఎస్‌పి మహేశ్వర రెడ్డి
- ఎస్‌పి కె.వి మహేశ్వర రెడ్డి
ప్రజాశక్తి – కోటబొమ్మాళి
ఈనెల ఒకటి నుంచి మూడో తేదీ వరకు నిర్వహించనున్న కొత్తమ్మతల్లి ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్‌పి కె.వి మహేశ్వర రెడ్డి తెలిపారు. బందోబస్తు విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బందికి స్థానిక కళ్యాణ మండపంలో సోమవారం దిశానిర్దేశం చేశారు. బందోబస్తును మూడు సెక్టార్లుగా విభజించి, రెండు షిప్ట్లుల వారీగా నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. దర్శనానికి వచ్చే యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. వృద్ధులు, వికలాంగులు నడవలేని వారికి ప్రత్యేకంగా దర్శనానికి అవకాశం కల్పించాలన్నారు. అవసరమైతే ప్రత్యేక వాహనాల ద్వారా దర్శనానికి తీసుకెళ్లాలని సూచించారు. క్యూలైన్ల నిర్వహణ క్రమబద్ధం చేయాలన్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధం చేసి, ఎటువంటి తోపులాటకు ఆస్కారం లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. యాత్రికులతో పోలీసులు మర్యాదపూర్వకంగా మెలగాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ప్రదేశాల్లో అవసరమైన సిబ్బందిని కేటాయించాలన్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా పార్కింగ్ యాత్రికులు తమ వాహనాలను నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాల్లో నిలిపేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. సిసి కెమెరాలను కంట్రోల్‌రూమ్‌తో అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. ఇతర శాఖల సమన్వయంతో ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్‌పి పి.శ్రీనివాసరావు, డిఎస్‌పి బి.రాజశేఖర్, సిఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారుఉత్సవాలకు కోటబొమ్మాళి ముస్తాబుకొత్తమ్మతల్లి ఉత్సవాలకు కోటబొమ్మాళి ముస్తాబైంది. కోటబొమ్మాళి పెద్ద చెరువు నుంచి కొత్తపేట కూడలి వరకు విద్యుత్ అలంకరణలు, కటౌట్లు, అనేక విగ్రహాలు, పిల్లలు, పెద్దలను అలరించే ఎగ్జిబిషన్‌ను ఘనంగా ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో ఉండే చిన్నారులకు పాలు, తాగునీరు ప్యాకెట్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ఆలయ ఇఒ వాకచర్ల రాధాకృష్ణ తెలిపారు.