ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట చర్యలు

నవంబరు ఒకటో తేదీన

ఫోన్‌లో మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు

  • అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం

ప్రజాశక్తి – కోటబొమ్మాళి

నవంబరు ఒకటో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. మండలంలోని నిమ్మాడలో గల తన క్యాంపు కార్యాలయం నుంచి ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్‌తో పాటు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్‌పి మహేశ్వర రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. ఇచ్ఛాపురం మండలంలోని ఈదుపురంలో ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ పథకాన్ని సిఎం ప్రారంభించనున్న నేపథ్యంలో ఎక్కడా ఎటువంటి లోటుపాట్లూ తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఏ చిన్న విషయంలోనూ అలసత్వం, నిర్లక్ష్యం వహించేందుకు వీల్లేదన్నారు. సభా వేదిక వద్ద జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. భద్రతా బలగాలు అణువణువూ గాలించి ఏ చిన్న అనుమానం వచ్చినా ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు. సిఎం పర్యటనకు స్వచ్ఛందంగా జనం వచ్చేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నందున సంబంధిత వర్గాలకు ఏ ఇబ్బందీ లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రోటోకాల్‌ నిబంధనలు పాటిస్తూ జిల్లా ప్రజాప్రతినిధులు, ఇతర ప్రాంత ప్రతినిధులను పోలీసులు సభా ప్రాంగణాన రిసీవ్‌ చేసుకోవాలని సూచించారు. ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని, నిబంధనల మేరకు వాహనాలను అనుమతించాలన్నారు.

➡️