ఆమదాలవలస : కొర్లకోట సచివాలయంలో నోటిఫికేషన్‌ను అతికిస్తున్న అధికారులు
- 4న నీటి సంఘాలకు, 17న డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు ఎన్నికలు
- నోటిఫికేషన్ విడుదల చేసిన జెసి ఫర్మాన్ అహ్మద్‌ఖాన్
ఎన్నికల ఏర్పాట్లలో జలవనరులశాఖ అధికారులు347 మంది ఎన్నికల అధికారుల నియామకంసాగునీటి సంఘాల ఎన్నికల సమరం తెరలేచింది. సాగునీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ బుధవారం వెలువరించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అమరావతిలో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఉండడంతో కలెక్టర్ తరుపున జెసి ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. సాగునీటి సంఘాలకు ఈనెల 14న, డిస్ట్రిబ్యూటరీ సంఘాలకు 17న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం 347 మంది ఎన్నికల అధికారులను నియమించారు. ఏయే సంఘాలకు ఎక్కడ ఎన్నిక నిర్వహించనున్నారో ఓటర్లకు సమాచారమిచ్చారు. వాస్తవానికి ఈ ఎన్నికలు ఈనెల 8వ తేదీన జరగాల్సి ఉండగా, ప్రభుత్వం అకస్మాత్తుగా వాయిదా వేసింది.
ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి
సాగునీటి సంఘాలకు సాఫీగా ఎన్నికలు నిర్వహించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో రెండు ప్రాజెక్టు వంశధార, నారాయణపురం వాటర్ యూజర్స్ కమిటీలు, 21 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఉన్నాయి. వీటితోపాటు మైనర్ వాటర్ యూజర్ అసోసియేషన్లు, 255 మేజర్ వాటర్ యూజర్ అసోసియేషన్లు 97 ఉన్నాయి. జిల్లాలో మీడియం వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ ఏమీ లేవు. వీటిలో వాటర్ యూజర్స్ అసోసియేషన్లకు ఈనెల 14 తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక సైతం అదే రోజున జరుగనుంది. 17న డిస్ట్రిబ్యూటరీ కమిటీ, ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలకు తేదీ ప్రకటించాల్సి ఉంది. జిల్లాలోని 30 మండలాల పరిధిలోని ఓటర్ల జాబితాలను ఇప్పటికే తహశీల్దార్ కార్యాలయాల్లో ప్రదర్శించారు. జిల్లాకు సంబంధించి మొత్తం 4,57,900 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష 3,42,594 ఓటర్లు మంది, మహిళా ఓటర్లు 1,15,306 మంది ఉన్నారు. ఎన్నిక ప్రక్రియ సాగేదిలా…ఓటర్లు అయిన రైతులంతా కలిసి వాటర్ యూజర్స్ అసోసియేషన్ (డబ్ల్యుయుఎ) సభ్యులను ఎన్నుకుంటారు. జిల్లాలో మేజర్, మైనర్ వాటర్ యూజర్స్ అసోసియేషన్ కమిటీలో 12 మంది సభ్యులు ఎన్నికవుతారు. మైనర్ వాటర్ యూజర్స్ అసోసియేషన్‌లో ఆరుగురు ఎన్నిక కానున్నారు. ప్రతి కమిటీ నుంచి ఎన్నికైన సభ్యులంతా అందులో ఇద్దరిని అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నుకుంటారు. యూజర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన వారంతా జిల్లాలోని 21 డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు సంబంధించిన అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులంతా కలిసి వంశధార, నారాయణపురం ప్రాజెక్టులకు సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఓటర్లు చేతులేత్తే ప్రక్రియ ద్వారా ఎన్నిక నిర్వహిస్తారు. ఎక్కడైనా గందరగోళం ఏర్పడి ఎన్నిక జరగకపోతే ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయం ప్రకారం ముందుకు సాగుతారు.పదవులపై కూటమి నాయకుల దృష్టిప్రభుత్వం అధికారంలో ఉండడంతో కూటమి పార్టీలైన టిడిపి, జనసేన, బిజెపి నాయకులు సాగునీటి సంఘాల పదవులపై ఆసక్తి కనబరుస్తున్నారు. సాగునీటి సంఘాలకు రాజకీయ పార్టీలతో సంబంధం లేకపోయినా, తమ పార్టీ నాయకులే పదవులు దక్కించుకునే కూటమి నాయకులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. 2014-19 కాలంలో నిర్వహించిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో కేవలం టిడిపి సానుభూతిపరులు మాత్రమే దక్కించుకోగా, ఇప్పుడు జనసేన, బిజెపి కూడా అందులో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాయి. ప్రభుత్వం అధికారంలో ఉండడంతో పదవులు వస్తే ప్రాధాన్యం ఉంటుందని భావిస్తున్న నాయకులు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల కోసం పోటీ పడుతున్నారు. వంశధార, నారాయణపురం ప్రాజెక్టు కమిటీలకు చైర్మన్లుగా ఎన్నికైతే ప్రోటోకాల్ అమలుతో పాటు వ్యవసాయ, నీటిసలహా మండలి, జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ, జెడ్‌పి సర్వసభ్య సమావేశాలకు హాజరయ్యేందుకు అవకాశం కలుగుతుంది. దీంతో ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పదవులను దక్కించుకునేందుకు కూటమి నేతలు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.