ఉపాధ్యాయుల సస్పెన్షన్లు ఎత్తివేయాలి

ఎచ్చెర్ల మండలం

నిరసన ప్రదర్శన చేపడుతున్న ఉపాధ్యాయులు

  • డిఇఒను విధుల నుంచి తొలగించాలి
  • ఉపాధ్యాయ సంఘాల ర్యాలీ

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఎచ్చెర్ల మండలం కుప్పిలి మోడల్‌ స్కూల్‌లో పదో తరగతి పరీక్షల మాస్‌ కాపీయింగ్‌ పేరుతో 14 మంది ఉపాధ్యాయులపై విధించిన సస్పెన్షన్లను ఎత్తివేయాలని ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక నాయకులు డిమాండ్‌ చేశారు. ఇదే డిమాండ్‌తో ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యాన నగరంలోని ఏడు రోడ్ల జంక్షన్‌ నుంచి జి.టి రోడ్డు మీదుగా జిల్లా విద్యాశాఖ కార్యాలయం వరకు మంగళవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా స్టీరింగ్‌ కమిటీ నాయకులు చౌదరి రవీంద్ర, మజ్జి మదన్‌మోహన్‌, తంగి మురళీమోహన్‌ మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా ఉపాధ్యాయులపై కక్షసాధింపు చర్యలను అవలంభిస్తున్న డిఇఒ తిరుమల చైతన్యను వెంటనే బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. కుప్పిలి మోడల్‌ స్కూల్‌ పరీక్షా కేంద్రంలో డిఇఒ, ఎచ్చెర్ల ఎంఇఒ ఉద్దేశపూర్వకంగా కక్షసాధింపు చర్యలను అవలంభించి హడావుడి చేశారని చెప్పారు. మాస్‌ కాపీయింగ్‌ జరిగిందని చెప్తున్న డిఇఒ స్లిప్‌లు ఎక్కడ పట్టుకున్నారో చెప్పాలన్నారు. దొరికాయని చెప్తున్న స్లిప్‌ల్లో ఉన్న అంశాలను జవాబు పత్రంలో ఎక్కడైనా రాసినట్లు ఆధారాలు ఉంటే చూపాలని డిమాండ్‌ చేశారు. ఉద్దేశపూర్వకంగా విద్యార్థులు, ఉపాధ్యాయులపై అమానుషంగా ప్రవర్తించిన తనిఖీ బృందంపై చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రం వద్ద కాకుండా జిల్లాపరిషత్‌ హైస్కూల్‌లో ఉన్న ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. విద్యార్థులను పరీక్షలు రాయనీయకుండా గంట కాలం పాటు వృథా చేసినందుకు తనిఖీ బృందం సభ్యులు ఏమని సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఉపాధ్యాయులపై పెట్టిన క్రిమినల్‌ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. డిఇఒ తిరుమల చైతన్య అక్రమాలపై శాఖాపరమైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. అన్యాయంగా డిబార్‌ అయిన విద్యార్థులను బేషరతుగా పరీక్షలకు అనుమతించాలన్నారు. డిఇఒను రిలీవ్‌ చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ నాయకులు ఎస్‌.కిషోర్‌ కుమార్‌, గొంటి గిరిధర్‌, పొందూరు అప్పారావు, బమ్మిడి శ్రీరామ్మూర్తి, డిటిఎఫ్‌ నాయకులు పేడాడ కృష్ణారావు, ఎం.కృష్ణయ్య, ఎస్‌టియు నాయకులు జి.రమణ, ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు.

➡️