డయాలసిస్ చేయించుకుంటున్న రోగులు (ఫైల్ ఫొటో)
- బళిస్తున్న కిడ్నీ వ్యాధి
- రోగులతో నిండిపోతున్న బెడ్‌లు
- పిహెచ్‌సిలకు మందులు కోత
ప్రజాశక్తి – కవిటి
కవిటి మండలం మధ్యపుట్టుగకు చెందిన 42 ఏళ్ల కొరికాన తిరుపతి చలాకీగా ఉండే మనిషి. తనకున్న కొద్దిపాటి భూమిని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆరు నెలల కిందట వచ్చిన జ్వరం ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడంతో, వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. అప్పటికే అతనికి ఉన్న కిడ్నీ వ్యాధి చేయిదాటిపోయిందని, డయాలసిస్ చేయించుకోకపోతే ప్రమాదమని వైద్యులు తేల్చేశారు. దీంతో శ్రీకాకుళం జెమ్స్ ఆస్పత్రిలో వారానికి రెండు రోజులు డయాలసిస్ చేసుకుంటున్నాడు. ఇలా అతనికొక్కరికే కాదు… పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో కొన్ని వందల కుటుంబాల కన్నీటి వ్యధ.
ఎలా వస్తుందో తెలీదు.. ఎందుకు వస్తుందో అసలే తెలీదు. చాలామందికి చివరి నిమిషం వరకూ తమకు కిడ్నీ వ్యాధి ఉందని తెలియకపోవడం ఎవరు కాదన్నా నమ్మలేని నిజం. ఉద్యానవనం లాంటి ఉద్దానం ప్రాంతంలో చాపకింద నీరులా వ్యాపించిన కిడ్నీ మహమ్మారికి కొన్ని వందల కుటుంబాలు బలైతే.. కొన్ని వేల మంది రోగులు వ్యాధితో పోరాడుతున్నారు. శ్రీలంక, మధ్య అమెరికా, జపాన్, జర్మనీ, ఇటలీతో పాటు భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో కిడ్నీ బాధితులు ఉన్నా, ఉద్దాన ప్రాంతమే ప్రాచుర్యంలోకి రావడానికి అనేక కారణాలు. కారణం ఏదైనా కిడ్నీలు కరిగిపోతున్నాయి.. మనుషులు కనుమరుగవుతున్నారనేది దాయలేని నిజం. ఈనెల 13వ తేదీన ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
ఉద్దానం ప్రాంతంలో పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో 2017 నుంచి 2024 అక్టోబర్ వరకు 3,41,207 మందిని పరీక్షిస్తే అందులో 23,086 మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్టు గుర్తించారు. అదే సమయంలో 2023 డిసెంబర్ వరకు 14,202 మంది కిడ్నీ వ్యాధితో చనిపోయారు. అక్కడ్నుంచి 2024 నవంబర్ 30 వరకు 496మంది ఈ వ్యాధితో చనిపోయినట్లు తెలిసింది. ఇక ఉద్దానం ప్రాంతంలో 18 పిహెచ్‌సిలు, 5 యుపిహెచ్‌సిలు, ఆరు పిహెచ్‌సిల పరిధిలో కిడ్నీ వ్యాధి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు టెక్కలి, పలాస, హరిపురం, సోంపేట, కవిటి డయాలసిస్ సెంటర్లలో 538 మంది రోగులు డయాలసిస్ చేసుకుంటున్నారు.
చిన్నాభిన్నమవుతున్న కుటుంబాలు
పిల్లాపాపలతో కళకళలాడుతున్న ఎన్నో కుటుంబాలు ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ మహమ్మారికి బలయ్యాయి. కుటుంబంలో ఒకరికి కిడ్నీ వ్యాధి సోకితే అటు ఆర్థికంగా, ఇటు మానసికంగా ఆ కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతం. ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రాణాన్ని కాపాడుకోలేని స్థితిలోకి చేరుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా కిడ్నీ వ్యాధికి గురైన పేదల పరిస్థితి దయనీయం. రెక్కాడితే గానీ డొక్కాడని ఎన్నో కుటుంబాలు ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రక్కసి కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. పదేళ్ల బాలుడి నుంచి పండు ముదుసలి వరకు ఎవరినీ వదలని ఈ మహమ్మారికి పిట్టల్లా జనాలు రాలిపోతుంటే పల్లెలు బోసిపోతున్నాయి.
పిహెచ్‌సిలకు మందుల కోత
ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకోవాల్సింది పోయి ఇప్పటివరకు పిహెచ్‌సిలకు సరఫరా చేస్తున్న మందులను టిడిపి కూటమి ప్రభుత్వం ఆపేసింది. గత ప్రభుత్వం ఉద్దానం ప్రాంతంలోని డయాలసిస్ యూనిట్లు ఉన్న ఆస్పత్రులతో పాటు అన్ని పిహెచ్‌సిలకు 12 రకాల మందులను సరఫరా చేసేది. అందులో కేవలం రెండు రకాల మందులు మాత్రమే పిహెచ్‌సిల్లో అందుబాటులో ఉన్నాయి. సిహెచ్‌సిల్లో కొంతమేర అందుబాటులో ఉన్నా, అవీ పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. కిడ్నీ రోగులకు అత్యవసరమైన ఫైబెక్సో స్టట్, సోడియం బైకార్బోనేట్, సెల్వర్‌మర్ వంటి మందులు అడపాదడపా వస్తున్నాయి. బడ్జెట్ లేదనే పేరుతో పిహెచ్‌సిలకు కోత పెట్టి డయాలసిస్ యూనిట్లు ఉన్న ఆసుపత్రులకు మాత్రమే అందిస్తోంది. పలాస కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో పాటు పలు సిహెచ్‌సిలకు తాజాగా సోడియం బైకార్పొనేట్ 500 ఎంజి మాత్రల సరఫరా నిలిచిపోయింది.
ఒకరు చనిపోతేనే ఇంకొకరికి బెడ్
డయాలసిస్ రోగులకు ప్రభుత్వం అందిస్తున్న రూ.పది వేల పింఛను ఆర్థికంగా కొంత ఊరట కలిగిస్తోంది. అయితే, సీరం క్రియాటినిన్ 5 పాయింట్లు దాటిన వారికి పింఛను మంజూరులో గానీ కిడ్నీ బాధితులకు పూర్తిస్థాయిలో మందుల సరఫరాలో కానీ ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. ముఖ్యంగా క్రియాటినిన్ 5 పాయింట్లు దాటిన రోగులు పింఛను మంజూరు కోసం పడుతున్న పాట్లు వర్ణనాతీతం. ఇంత బాధపడినా వంద మందిలో కనీసం పది మందికీ పింఛను మంజూరైన పరిస్థితి లేదు. ఇక డయాలసిస్ రోగుల పరిస్థితి దయనీయం. అందుబాటులో సరిపోయే బెడ్లు లేకపోవడంతో పలాస, శ్రీకాకుళం, విశాఖపట్నం వెళ్లి డయాలసిస్ చేయించుకుంటున్నారు. వారికి దగ్గర్లో బెడ్ దొరకాలంటే ఎవరో ఒక డయాలసిస్ రోగి చనిపోతేనే అవకాశమున్న దయనీయ పరిస్థితి. దీంతో ఎంతోమంది డయాలసిస్ రోగులు అటు ఆర్థికంగా ఇటు మానసికంగా నరకయాతన అనుభవిస్తున్నారు. కవిటిలో 19, సోంపేటలో 19 బెడ్లు అందుబాటులో ఉంటే 238 రోగులు డయాలసిస్ చేయించుకుంటున్నారు. బెడ్ కోసం సుమారు 20 మందికి పైగా వేచిచూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కవిటి, సోంపేట డయాలసిస్ కేంద్రాల్లో బెడ్లు పెంచడమే కాకుండా, ఇచ్ఛాపురంలో కొత్తగా డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తే రోగులకు కొంత ఊరట లభిస్తుంది.
అందుబాటులో లేని నెఫ్రాలజిస్ట్
కిడ్నీ రోగాలను పరీక్షించే నెఫ్రాలజీ వైద్యుని నియామకంలో ప్రభుత్వాల తాత్సారం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో కిడ్నీ రోగులు ఉద్దానం ప్రాంతం నుంచి నెఫ్రాలజీ వైద్యుని కలిసేందుకు విశాఖపట్నం, శ్రీకాకుళం పయనమవుతున్నారు. అదే స్థానికంగా ఓ నెఫ్రాలజిస్ట్ అందుబాటులో ఉంటే రోగులకు ఆర్థికంగానే కాకుండా మానసికంగానూ సాంత్వన లభిస్తుంది.
ఈ ఏడాది థీమ్’ఆరోగ్యకరమైన మూత్రపిండాల కోసం ముందస్తు గుర్తింపునకు ప్రాధాన్యత ఇవ్వడం’