పకడ్బందీగా ‘పది’ పరీక్షలు

ఈనెల 17 నుంచి 31వ

మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం

ఈనెల 17 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ ఆదేశించారు. ఎస్‌ఎస్‌సి పరీక్షలకు సంసిద్ధత, స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర, పి4 మోడల్‌ సర్వే, తదితర అంశాలపై కలెక్టర్‌, ఎస్‌పితో సచివాలయంలోని సిఎస్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర చర్యలపై సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను అనుమతించరాదని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణపై సోషల్‌ మీడియాలో ఎటువంటి రూమర్లకు తావులేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతినెల మూడో శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అర్దవంతంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు. సానుకూల ప్రజా అవగాహన, పి4 మోడల్‌ సర్వే, తదితర అంశాలకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్‌ మాట్లాడుతూ సిఎస్‌ నిర్ధేశించిన అంశాలపై సమగ్ర నివేదికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా పరీక్షల సమయంలో అవసరమైన బస్సులను నడపాలని ఆర్‌టిసి అధికారులను ఆదేశించారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు ముందస్తు పరిశీలన చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్‌పి కె.వి మహేశ్వర్‌ రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, జెడ్‌పి సిఇఒ శ్రీధర్‌ రాజా, సిపిఒ ప్రసన్నలక్ష్మి, డిపిఒ భారతి సౌజన్య, వ్యవసాయ శాఖ అధికారి కె.త్రినాథస్వామి, డిఇఒ తిరుమల చైతన్య, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️