12వ పిఆర్‌సి కమిషన్‌ను పునరుద్ధరించాలి

ఉద్యోగ, ఉపాధ్యాయులకు

వినతిపత్రం అందజేస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

  • జెసికి యుటిఎఫ్‌ నాయకుల వినతి

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఉద్యోగ, ఉపాధ్యాయులకు 12వ వేతన సవరణ అమల్లో భాగంగా పిఆర్‌సి కమిషన్‌ నియమించడంతో పాటు పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కిషోర్‌ కుమార్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.శ్రీరామూర్తి కోరారు. కలెక్టరేట్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ను మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయుల బకాయిల చెల్లింపునకు రోడ్‌ మ్యాప్‌ను ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. 2004కు ముందు నియామక ప్రక్రియ పూర్తయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు మెమో 57 ప్రకారం పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు 2023 జులై ఒకటి నుంచి 12వ వేతన సవరణ సంఘం అమల్లో ఉండాలని గత ప్రభుత్వం మన్మోహన్‌ సింగ్‌ను చైర్మన్‌గా ఏర్పాటు చేసి ఒక్క సమావేశాన్నీ నిర్వహించలేదన్నారు. కమిషన్‌ను పునరుద్ధరించాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో రూ.20 వేల కోట్ల ఆర్థిక బకాయిలు ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సి ఉందని, ఆ బకాయిలు నేటికీ రూ.32 వేల కోట్లకు చేరుకున్నాయన్నారు. 11వ పిఆర్‌సి ఎరియర్స్‌ రూ.7384 కోట్లు, సరెండర్‌ లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ రూ.9,650 కోట్లు, సిపిఎస్‌ ఉద్యోగుల బకాయిలు రూ.2500 కోట్లు, ఎపిజిఎల్‌ఐ చెల్లింపులు రూ.950 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. ఆర్థిక సమస్యలతో ఉద్యోగ, ఉపాధ్యాయులు సతమతమవుతున్నారని ఈ సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరారు. జెసిని కలిసిన వారిలో యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు చౌదరి రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.

➡️