వివరాలను వెల్లడిస్తున్న ఎస్‌పి మహేశ్వర రెడ్డి
- ఎస్‌పి మహేశ్వర రెడ్డి
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్ విద్యార్థిని కొరికాన లక్ష్మిపై దాడి ఘటనలో నిందితుడు సారవకోట మండలం గోవర్థనపురానికి చెందిన కణితి జగదీష్‌ను అరెస్టు చేసినట్లు ఎస్‌పి కె.వి మహేశ్వర రెడ్డి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పదో తరగతి వరకు చదువుకున్న జగదీష్, ఆ తర్వాత చదువు మానేసి హైదరాబాద్ వెళ్లి సినిమా ప్రయత్నాలు చేస్తూ అక్కడే ఉన్నాడు. సీరియల్స్‌లో చిన్న పాత్రలు చేసి ఖాళీగా ఉన్నాడు. గతేడాది డిసెంబరులో బంధువుల ఫంక్షన్‌కు వచ్చి బస్సులో తిరిగి వెళ్తున్న సమయంలో పక్క సీటులో కూర్చొన్న సంతకవిటి మండలం కొండగూడెంకు చెందిన విద్యార్థిని లక్ష్మితో పరిచయమైంది. అప్పట్నుంచీ ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్లు. గత నెల 30వ తేదీన హాస్టల్ నుంచి బయటకు వచ్చిన లక్ష్మి, జగదీష్ సాయంత్రం వరకు కలిసి తిరిగారు. తిరిగి హాస్టల్ వైపు వెళ్తున్న సమయంలో పెళ్లి ప్రతిపాదన చేయడంతో లక్ష్మి తిరస్కరించింది. దీంతో కోపోద్రిక్తుడైన జగదీష్ ఆమె గొంతు నొక్కి, ఎడమ కన్నుపై పిడిగుద్దులు గుద్ది గోడ వైపు తోశాడు. కింద పడిపోయిన లక్ష్మి కేకలు వేయగా, ఆమె మెడపై కాలు వేసి తొక్కాడు. లక్ష్మి స్పృహ కోల్పోవడంతో భయపడి ఆమె రెండు మొబైల్ ఫోన్లు తీసుకుని అక్కడ్నుంచి పారిపోయాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని ఆదివారం నగరంలోని కోటేశ్వర స్వామి ఆలయ సమీపంలో పట్టుకున్నారు. నిందితుడు నుంచి రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపారు. ఈ కేసును చేధించడంలో కృషి చేసిన పోలీసులను ఎస్‌పి అభినందించారు.