ప్రతిజ్ఞ చేయిస్తున్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత అని కేంద్ర మహిళా శిశుసంక్షేమశాఖ మంత్రి అన్నపూర్ణా దేవి అన్నారు. వీటిని నిర్మూలించడమే ప్రధాన లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో బుధవారం నిర్వహించిన ‘బాల్య్ వివాV్‌ా ముక్త్ భారత్’ కార్యక్రమానికి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాల విముక్తి భారత్ లక్ష్యమని చెప్పారు. పిల్లలు ఎదగడానికి, వృద్ధి చెందడానికి సురక్షితమైన వాతావరణం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో బాల్య వివాహాలు నిర్మూలనకు అసాధారణ కృషి చేసిన కొందరు వ్యక్తులు, బాల్య వివాహాలను ఎదుర్కొని విజయం పొందిన ఎంపిక చేసిన తొమ్మిది మంది బాలికలతో వర్చువల్ గా వారి అనుభవాలను ఆమె తెలుసుకున్నారు. ఇందులో ఎచ్చెర్ల మండలం కుంచాల కురమయ్యపేటకు చెందిన బుచ్చ రమణమ్మ తన అనుభవాలను తెలిపారు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తనకు 14 ఏళ్ల వయసులో వివాహం చేశారని, సదరు విషయం సమగ్ర బాలల పరిరక్షణ విభాగానికి తెలిసి తన తల్లిదండ్రులకు పలుమార్లు కౌన్సెలింగ్ నిర్వహించి వివాహాన్ని రద్దు చేయించారని తెలిపారు. ప్రస్తుతం బిటెక్ చదువు పూర్తి చేసుకుని, ఐటి సొల్యూషన్ కంపెనీ, హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నానని చెప్పారు. మరెంతో మంది బాలికలకు తన అనుభవాలను పంచుకుంటూ బాల్య వివాహాల నిర్మూలనకు తనవంతు కృషి చేస్తున్నానని తెలిపారు.కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు దేశంలో ఒక పెద్ద సమస్యగా మారిందన్నారు. దీన్ని అధిగమించడానికి అందరి సహకారం అవసరమని చెప్పారు. బాల్య వివాహల కారణంగా వారి జీవితాల్లో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. అనంతరం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి బి.శాంతిశ్రీ, పిఒ ఎం.మల్లేశ్వరరావు, పిఒఐఎల్ నాయుడు, వన్ స్టాప్ సెంటర్ కోఆర్డినేటర్ హిమబిందు, పలు కళాశాలల విద్యార్థినులు, బ్రెడ్స్ సచ్చంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.కొవ్వొత్తుల ర్యాలీ బాల్య వివాహాల నిర్మూలనపై నగరంలోని సూర్యమహల్ కూడలి వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు ఎక్కడ జరిగినా మహిళా సంరక్షణ కార్యదర్శికి, పిల్లల సహాయ వాణి టోల్ ఫ్రీ నంబరు 1098 తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ పీడీ బి.శాంతిశ్రీ, పలు సంఘాల ప్రతినిధులు, అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థినులు పాల్గొన్నారు.