పంచాయతీరాజ్‌ వ్యవస్థ బలోపేతమే లక్ష్యం

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం

మాట్లాడుతున్న జెడ్‌పి సిఇఒ వెంకట్రామన్‌

ఎపిఎస్‌ఐఆర్‌డి అసిస్టెంట్‌ కమిషనర్‌ కృష్ణమోహన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేయడమే రాష్ట్రీయ గ్రామ స్వరాజ్‌ అభియాన్‌ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ కృష్ణ్ణమోహన్‌ అన్నారు. జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఆయా అంశాలపై పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వనున్నామని చెప్పారు. గ్రామ, మండల, జిల్లాపరిషత్‌లో సాధారణ కనీస పరిపాలనా విధాన చట్టం 1994, గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ, తాగునీటి సరఫరా, లేఅవుట్‌ ప్లాన్లు, బిల్డింగ్‌ రెగ్యులరైజేషన్‌, స్థానిక సంస్థల ఆస్తులు పరిరక్షణ, వీధిదీపాలు, విద్యుత్‌ బిల్లుల నిర్వహణ, ఆర్థిక నిర్వహణ, చట్టపరమైన అక్షరాస్యత, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్య శాసనాలు, సాంఘిక సంక్షేమ పథకాలు తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. శిక్షణలో భాగంగా ఎంపిక చేసిన పంచాయతీరాజ్‌లోని పలు కేడర్‌లకు చెందిన 11 మందికి ప్రత్యక్షంగా శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. వీరంతా ఆయా గ్రామ పంచాయతీల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఆయా అంశాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేలా శిక్షణ ఇస్తారని చెప్పారు. శిక్షణలో జెడ్‌పి సిఇఆర్‌ ఆర్‌.వెంకట్రామన్‌, జిల్లా పంచాయతీ అధికారి ఆర్‌.వెంకటేశ్వరరావు, ఎంపిడిఒలు, ఇఒపిఆర్‌డిలు పాల్గొన్నారు.

 

➡️