వివరాలను వెల్లడిస్తున్న ఎస్‌పి మహేశ్వర రెడ్డి
- ఏడు రాష్ట్రాల్లో 142 కేసుల్లో నిందితులు
- రూ.5,33,530 విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం
- ఎస్‌పి కె.వి మహేశ్వర రెడ్డి
ప్రజాశక్తి – శ్రీకాకుళం
జిల్లాలో మూడేళ్ల వ్యవధిలో 14 చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్‌పి కె.వి మహేశ్వర రెడ్డి తెలిపారు. నిందితులు ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌కు చెందిన నూర్ హాసన్, ఛత్తీస్‌ఘడ్‌లోని రారుపూర్‌కు చెందిన ఇర్ఫాన్ అహ్మద్, అబ్దుల్ గఫూర్‌గా గుర్తించామన్నారు. నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 14న పలాస కాశీబుగ్గ శివాజీనగర్‌లో నివాసముంటున్న పాడి చంద్రశేఖర్ తన ఇంటికి తాళం వేసి బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లి తిరిగి వచ్చేసరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లో మూడు కిలోల వెండి ఆభరణాలు, వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించి కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎఎస్‌పి (క్రైమ్) పి.శ్రీనివాసరావు నేతృత్వాన కాశీబుగ్గ డిఎస్‌పి వి.వెంకట అప్పారావు, సిఐ సూర్యనారాయణ, సిసిఎస్ సిఐ చంద్రమౌళి, ఎస్‌ఐ మధుసూదనరావు, క్లూస్ ఎస్‌ఐ భరత్ బృందాలుగా ఏర్పడ్డారు. మొగిలిపాడు కూడలి వద్ద మంగళవారం వాహన తనిఖీలు చేస్తుండగా లారీలో నిందితులు పట్టుబడ్డారు. నిందితులు ఛత్తీస్‌ఘడ్ నుంచి కందిపప్పును కాశీబుగ్గ ప్రాంతానికి తీసుకొచ్చి సరుకును దింపే సమయంలో రెక్కీ నిర్వహించి ఇళ్లలో చోరీకి పాల్పడడం అలవాటుగా మార్చుకున్నారు. నిందితుల్లో నూర్ హాసన్‌పై ఏడు రాష్ట్రాల్లో 140 కేసులు ఉన్నాయి. ఇప్పటికే 32 కేసుల్లో అరెస్టయి రారుపూర్ జైలులో శిక్ష అనుభవిస్తూ బెయిల్‌పై వచ్చాడు. జైల్లో ఉన్న సమయంలోనే ఇర్ఫాన్ అహ్మద్, గఫూర్‌తో స్నేహం కుదిరింది. వీరు శ్రీకాకుళం వచ్చి తరచూ చోరీలకు పాల్పడినట్లు గుర్తిచామని ఎస్‌పి తెలిపారు. జిల్లాలో 2023లో మందస, కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్లలో రెండు కేసులు నమోదు కాగా, 2024లో కాశీబుగ్గలో ఐదు, సోంపేటలో ఒకటి, ఇచ్ఛాపురంలో రెండు, వజ్రపుకొత్తూరులో ఒకటి, 2025లో ఇప్పటివరకు కాశీబుగ్గలో రెండు కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ కేసుల్లో రూ.12,93,614 వలువైన బంగారం, వెండి, నగదు చోరీకి గురైందని, నిందితుల నుంచి రూ.5,33,530 విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో చోరీకి గురైన బంగారం నకిలీదిగా గుర్తించినట్లు తెలిపారు. తొమ్మిది తులాల బంగారు నగలు పోయినట్లు బాధితులు ఫిర్యాదు చేశారని, అందులో 1 గ్రామ్ గోల్డ్ మినహా మిగిలినదంతా రోల్డ్ గోల్డ్‌గా గుర్తించినట్లు తెలిపారు. పోలీసులను తప్పుదోవ పట్టించే రీతిలో తప్పుడు ఫిర్యాదులు చేయరాదన్నారు. సమావేశంలో ఎఎస్‌పి పి.శ్రీనివాసరావు, కాశీబుగ్గ డిఎస్‌పి వి.వెంకట అప్పారావు, స్పెషల్ బ్రాంచి సిఐ ఇమాన్యుయేల్ రాజు, కాశీబుగ్గ సిఐ సూర్యనారాయణ, సిసిఎస్ సిఐ చంద్రమౌళి, ఎస్‌ఐ మధుసూదనరావు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.