19, 20న బీచ్‌ ఫెస్టివల్‌

ఈనెల 19, 20 తేదీల్లో బారువలో బీచ్‌ ఫెస్టివల్‌ ఘనంగా

ఆలివ్‌రిడ్లే తాబేళ్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

ప్రజాశక్తి – సోంపేట

ఈనెల 19, 20 తేదీల్లో బారువలో బీచ్‌ ఫెస్టివల్‌ ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌తో కలిసి మండలంలోని బారువ హరిత బీచ్‌ రిసార్ట్‌లో బీచ్‌ ఫెస్టివల్‌ నిర్వహణ ఏర్పాట్లపై బుధవారం సమీక్షించారు. ముందుగా సంబంధిత అధికారులతో కలిసి బీచ్‌ పరిసరాలు పరిశీలించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై జిల్లా పర్యాటక శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం హరిత బీచ్‌ రిసార్ట్‌లో సంబంధిత అధికారులతో మాట్లాడుతూ 19వ తేదీన ప్రారంభం కానున్న బీచ్‌ ఫెస్టివల్‌కు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొంటారని తెలిపారు. ఆ రోజు ఉదయం 5.30 గంటలకు తాబేళ్లను సముద్రంలోకి విడిచిపెట్టి కార్యక్రమం ప్రారంభిస్తారని చెప్పారు. బీచ్‌ ఫెస్టివల్‌తో పాటు స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా బీచ్‌ క్లినింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. సోంపేట మండలం పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందిందన్నారు. ఎత్తయిన ఇసుక దిబ్బలు ఎటు చూసినా పచ్చదనంతో ఆహ్లాదంగా కనిపించే కొబ్బరి తోటలు ఆధ్యాత్మికతను నింపే ప్రాముఖ్యత కలిగిన పురాతన ఆలయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే లైట్‌ హౌస్‌, రిసార్ట్స్‌ నిలుస్తాయన్నారు. బీచ్‌ ఫెస్టివల్‌ ఘనంగా నిర్వహించాలని ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు రాకుండా కార్యక్రమాన్ని విజయవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో నిర్వహించే క్రీడలపై ప్రజల్లో ఆసక్తిని పెంపొందించేలా ప్రణాళికాబద్ధంగా రూపొందించాలని సూచించారు. దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ముందుగానే రోజుకొక కార్యక్రమాన్ని చేపట్టి పెద్దఎత్తున ప్రచారం చేయాలన్నారు. దానికి సంబంధించి డిజిటల్‌, సోషల్‌, ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియాలను వినియోగించుకోవాలని సూచించారు. ఫెస్టివల్‌కు ప్రముఖులను ఆహ్వానించాలని తహశీల్దార్‌ అప్పలస్వామికి సూచించారు. కాశీబుగ్గ డిఎస్‌పి ట్రాఫిక్‌ నియంత్రణ చేపట్టాలని, జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యాన పారిశుధ్య నిర్వహణ చేపట్టాలన్నారు. మత్స్యశాఖ అధికారి లైఫ్‌ గార్డు బోట్లు ఏర్పాటు చేయాలన్నారు. పర్యాటక శాఖ అధికారి, డిఎస్‌ఒ, వైద్య, మెరైన్‌, అగ్నిమాపక, ఆర్‌అండ్‌బి, అటవీ, నీటిపారుదల, విద్యుత్‌ శాఖ అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పర్యాటక అభివృద్ధికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకుని జిల్లాకు పర్యాటకంగా మంచి పేరు వచ్చేలా కార్యక్రమాలు ఉండాలన్నారు. అనంతరం పాత దిబ్బలపాలెం సముద్ర తాబేలు సంరక్షణ కేంద్రం నుంచి 205 సముద్ర తాబేలు పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టారు. కార్యక్రమంలో పలాస ఆర్‌డిఒ వెంకటేశ్వర్లు, ఆర్‌ అండ్‌ బి ఎస్‌ఒ జాన్‌ సుధాకర్‌, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి అనిత, మత్స్య శాఖ ఉప సంచాలకులు సత్యనారాయణ, డిఎస్‌డిఒ శ్రీధర్‌, జిల్లా పర్యాటక అధికారి ఎన్‌.నారాయణరావు, అటవీశాఖ అధికారి నాయుడు, వెంకటేష్‌, హరిత బీచ్‌ రిసార్ట్స్‌ ఎమ్‌డి విశ్వనాథ్‌, మేనేజర్‌ సందీప్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

➡️