ఆప్కాస్‌ రద్దును విరమించుకోవాలి

ఆప్కాస్‌ రద్దును ప్రభుత్వం విరమించుకోవాలని ఎపి

సమావేశంలో మాట్లాడుతున్న బలరాం

ప్రజాశక్తి – ఆమదాలవలస

ఆప్కాస్‌ రద్దును ప్రభుత్వం విరమించుకోవాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.బలరాం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పట్టణంలోని ఐ.జె నాయుడు కాలనీలో మున్సిపల్‌ కార్మికుల సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్‌ను రద్దు చేసి, ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. 17 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వ ఒప్పందాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వ సిఫార్సులను ఆర్థిక శాఖ ఆమోదించకుండా కూటమి ప్రభుత్వం వెనక్కి పంపడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక అవుట్‌సోర్సింగ్‌ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామని, ఉద్యోగాలు పర్మినెంట్‌ చేస్తామని హామీనిచ్చారని గుర్తుచేశారు. ప్రభుత్వం కొలువుదీరి ఎనిమిది నెలలైనా హామీని నెరవేర్చలేదని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు. విధుల్లో పనిచేస్తూ చనిపోయిన, గాయపడిన కార్మికుల స్థానంలో వాళ్ల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పర్మినెంట్‌ కార్మికులకు రెండో శనివారంతో పాటు జాతీయ సెలవులు పూర్తిస్థాయిలో అమలు చేయాలని, కాంట్రాక్టు కార్మికులకు జాతీయ సెలవులు వర్తింపజేయాలని కోరారు. నగర పరిధిని దృష్టిలో పెట్టుకుని కార్మికుల సంఖ్యను పెంచాలన్నారు. పుష్‌ కాట్స్‌, బిన్‌లు, ఇతర పనిముట్లు వెంటనే అందించాలని, బళ్లు మరమ్మతులు చేయాలని, సమ్మెకాలపు ఒప్పందాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని లేకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో ఫెడరేషన్‌ నాయకులు తాడి సంతోష్‌ కుమార్‌, కె.తారక్‌, కె.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️