ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి
టిడిపి కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఈ నెల 12 నాటికి సరిగ్గా నెల రోజులైంది. ఎన్నికల్లో తమకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం ఏం చేయబోతుందా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరితో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులూ వారికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా? అని వేచిచూస్తున్నారు. ప్రభుత్వం నుంచి మంచి నిర్ణయాలు పక్కన పెడితే ఈ నెల 12న గ్యారంటీ పెన్షన్ స్కీం (జిపిఎస్)పై ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ వెలువరించడాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు జీర్ణించుకోలేకపోతున్నారు. గత ప్రభుత్వ హయాంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఓల్డ్ పెన్షన్ స్కీం (ఒపిఎస్) అమలు కోసం ఎంతగా కొట్లాడారో మనం చూశాం. తాము అధికారంలోకి వస్తే సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చేశారు. ఒపిఎస్‌పై అవగాహన లేక హామీ ఇచ్చామని, అంతకంటే మెరుగైన పెన్షన్ విధానం తీసుకొస్తామంటూ అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సెలవిచ్చారు. ఆ తర్వాత దానిపై వైసిపి ప్రభుత్వం రకరకాల కమిటీలు వేసి కొంతకాలం కాలయాపన చేసింది. చివరకు సిపిఎస్ స్థానంలో ఉద్యోగులకు మరింత నష్టం చేసే జిపిఎస్‌ను తీసుకొచ్చింది. దానిపై ఆర్డినెన్స్ తీసుకొచ్చి గెజిట్ నోటిఫికేషన్ విడుదలకూ ప్రయత్నించింది. ఎన్నికలకు ఏడాది సమయమే ఉండటంతో ప్రభుత్వం రిస్క్ తీసుకోవడానికి సాహించలేదు. దీనిపై ఉద్యోగులు ఓటు ఫర్ ఒపిఎస్ అనే నినాదంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. పోరాటాల ఫలితంగా తాత్కాలికంగా గతంలో జిఒను విడుదల చేయకుండా వెనక్కు తగ్గింది. సిపిఎస్ రద్దుకు హామీ ఇచ్చి మోసగించిన వైసిపి ఎన్నికల్లో భారీ మూల్యమే చెల్లించుకుంది. ఎన్నికల సమయంలో వైసిపిపై దీనిపై మాట్లాడకపోయినా కూటమి తరుపున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో దీనిపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. సిపిఎస్ రద్దు, వైసిపి తీసుకొచ్చిన జిపిఎస్‌పై ఉద్యోగ సంఘాలతో చర్చించి, వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించిన తర్వాతే పెన్షన్ విధానం అమలు చేస్తామని మాటిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి పెద్దలు ఇప్పుడు ఏ చర్చా లేకుండానే జిపిఎస్‌పై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం ఉద్యోగులను షాక్‌కు గురిచేసింది. పైగా ఏమీ ఎరగనట్టు అప్పటి ఆర్థికశాఖ కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ జూన్ 12న జిఒ నంబరు 54ను విడుదల చేశారని, గత ప్రభుత్వం రూపొందించిన నోటిఫికేషన్‌నే గెజిట్‌లో అప్‌లోడ్ చేశామంటూ టిడిపి కూటమి ప్రభుత్వం నమ్మబలుకుతోంది. జూన్ 12న జిఒ జారీ అయ్యిందంటే కూటమి ప్రభుత్వం కొలువు దీరిన తర్వాతే ఇది జరిగిందన్న మాట. కూటమి ప్రభుత్వం వస్తుందన్న గట్టి నమ్మకంతో ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే ఈ ఫైలింగ్‌పై అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేఖ రాసి నిలుపుదల చేయించారు. గత ప్రభుత్వం ట్రైనీ ఐఎఎస్‌లకు ప్లేస్‌మెంట్‌లు కేటాయిస్తున్నారన్న సమాచారంతో కేంద్రానికి సైతం చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఫైల్ మాయం కాకుండా గనులశాఖ, సిఐడి కార్యాలయాలను సీజ్ చేయించారు. గత ప్రభుత్వ పాపాలపై ముందుస్తు చర్యలు తీసుకున్న చంద్రబాబు జిపిఎస్ జిఒను ఎందుకు ఆపలేకపోయాన్న చర్చ ఉద్యోగుల్లో సాగుతోంది. ప్రభుత్వ ఉద్దేశపూర్వకంగానే జిపిఎస్‌ను తీసుకొచ్చి ఆ నెపాన్ని వైసిపి ఖాతాల్లో వేయాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఒపిఎస్‌తో పాటు ఇతర సమస్యలపై కొత్త ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశలు పెట్టుకున్న ఉద్యోగులను ఆదిలోనే వంచించడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతకు తానే బీజం వేసుకుంది. కక్ష సాధింపు చర్యలు లేవంటూనే టిడిపి కూటమి ప్రభుత్వం తన పని తాను చేసుకువెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. కొత్త తరహాలో వేధింపులకు స్వీకారం చుడుతున్నట్లు పరిణామాల బట్టి తెలుస్తోంది. వైసిపి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపై టిడిపి ఎమ్మెల్యేలతోనే ఫిర్యాదులు చేయించి పోలీస్ కేసులు నమోదు చేయిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. గత ప్రభుత్వం హయాంలో చంద్రబాబును, లోకేష్‌ను దూషించడంతో పాటు టిడిపి కార్యాలయాలపై దాడికి పాల్పడ్డవారిని లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల ఈ పద్ధతి కొనసాగుతుండగా… తాజాగా జిల్లాలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష శనివారం మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుపై కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును ఆయన మానసిక స్థితి బాగోలేదని, వైద్యుడికి చూపించాలని మాజీ మంత్రి అప్పలరాజు అన్నట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు..గత ప్రభుత్వ హయాంలోనూ ఇదే తంతు కొనసాగింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని, ప్రభుత్వాన్ని విమర్శించడమే పాపమన్నట్లుగా టిడిపి నాయకులపై అప్పటి ప్రభుత్వం కేసులు నమోదు చేయించి జైలుకి పంపింది. వైసిపి ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తుందంటూ అప్పుడు టిడిపి నాయకులు విమర్శించగా… లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతుందంటూ ఇప్పుడు వైసిపి నాయకులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం అమరావతిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించి పార్టీ నేతలెవరూ వ్యక్తిగత దాడులకు, కక్ష సాధింపులకు దిగొద్దంటూ హితవు పలుకుతున్నారు. తప్పు చేసిన వారిని చట్ట పరంగానే శిక్షిద్దామంటూ ప్రతీకారంతో రగిలిపోతున్న టిడిపి శ్రేణులకు శాంతింపచేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే అప్పటి వైసిపి నేతలపై ఫిర్యాదులు, కేసులు నమోదు చేయడం జరుగుతున్నాయనేది తేటతెల్లమవుతోంది. టిడిపి కూటమి ప్రభుత్వం అన్నీ ఒకేసారి చేయలేదని, హామీల అమలుకు కొంత సమయం కావాలని చెప్తున్న టిడిపి పెద్దలు కేసులు, కక్ష సాధింపులకు పాల్పడే విషయంలో చాలా వేగంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. వైసిపి చేసిన తప్పులే మనమూ చేస్తే వారికీ మనకూ తేడా ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ పెద్దలతో చెప్పిన మాటలు నూటికి నూరు పాళ్లు నిజం. అభివృద్ధిని వదిలేసి నియంతృత్వం, తీవ్ర నిర్బంధం, కేసులతో ప్రతికార చర్యలకు పాల్పడటం వల్లే వైసిపికి కనీసం ప్రతిపక్ష హోదా దక్కని దుస్థితి వచ్చింది. దీనిని గుణపాఠంగా నేర్చుకుని అభివృద్ధి వైపుగా టిడిపి కూటమి ప్రభుత్వం అడుగులు వేయాలని అంతా ఆశిద్దాం.