జిల్లా కేంద్ర రూపురేఖలు మారుస్తా

జిల్లా కేంద్ర రూపురేఖలు మారుస్తానని రాష్ట్ర వ్యవసాయ

జిల్లాలో ఐఎఎస్‌, ఐపిఎస్‌ స్టడీ సర్కిల్‌ ఏర్పాటుకు కృషి

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

ప్రజాశక్తి – గుజరాతీపేట

జిల్లా కేంద్ర రూపురేఖలు మారుస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా పొన్నాడ బ్రిడ్జి వద్ద పూలే విగ్రహానికి శుక్రవారం పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. మంత్రితో పాటు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యే సభ్యులు గొండు శంకర్‌, బిసి సంఘం నాయకులు నివాళ్లర్పించారు. అనంతరం వాంబే కాలనీ వద్ద రూ.ఐదు కోట్లతో నిర్మించిన బిసి సంక్షేమ భవన సముదాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పూలే ఆశయాలను కొనసాగించి ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రతి శాఖకు సంబంధించి శాశ్వత, ప్రజలకు ఉపయుక్తమైన పనులు చేపట్టినట్లు తెలిపారు. తాను బిసి సంక్షేమశాఖ మంత్రిగా ఉన్నప్పుడే బిసి సంక్షేమ భవనాలు మంజూరు చేసినట్లు చెప్పారు. ఇదే భవన సముదాయంలో పైన రెండు గదులు ఏర్పాటు చేసి ఐఎఎస్‌, ఐపిఎస్‌ స్టడీ సర్కిల్‌ ఏర్పాటుకు సంబంధిత మంత్రితో మాట్లాడుతానన్నారు. పక్కనే ఖాళీగా ఉన్న స్థలంలో ఓపెన్‌ ఆడిటోరియం ఏర్పాటు చేస్తే, పేద బిసిలు వివాహాలకు ఉపయోగపడుతుందన్నారు. నిర్వహణను అవుట్‌సోర్సింగ్‌కు ఇవ్వాలని కలెక్టర్‌కు సూచించారు. బిసిల కోసం అమలు చేసే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మార్కెట్‌ను సమూల మార్పులు చేస్తామని, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయాన్ని అధునాతన సౌకర్యాలతో నిర్మిస్తామన్నారు. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు సహకరించాలని కోరారు. అనంతరం బిసి స్వయం ఉపాధి పథకం కింద 458 మంది లబ్ధిదారులకు రూ.8.50 కోట్ల చెక్కును మంత్రి అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, ఆర్‌డిఒ కె.సాయి ప్రత్యూష, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్‌, కాళింగ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ రోణంకి కృష్ణమూర్తి నాయుడు, బిసి, ఎస్‌సి, మైనార్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

➡️