రైతులను దగా చేస్తున్న ప్రభుత్వం

రైతులను ఉద్దరిస్తామని కల్లబొల్లి కబుర్లు

కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న వైసిపి నాయకులు

కలెక్టరేట్‌ వద్ద వైసిపి ధర్నా

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

రైతులను ఉద్దరిస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పిన టిడిపి కూటమి ప్రభుత్వం, అధికారంలోకొచ్చాక వారిని దగా చేస్తోందని వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. వైసిపి రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కలెక్టరేట్‌ వద్ద శుక్రవారం ధర్నా చేపట్టారు. నగరంలోని 80 అడుగుల రోడ్డు నుంచి కలెక్టరేట్‌ వరకు ఎడ్ల బండి మీద ర్యాలీగా ఆ పార్టీ నాయకులు కలెక్టరేట్‌ వరకు వచ్చారు. దారిపొడవునా ప్లకార్డులు ప్రదర్శిస్తూ రైతులకు మద్దతుగా నినాదాలు చేశారు. అనంతరం అక్కడ చేపట్టిన ధర్నానుద్దేశించి కృష్ణదాస్‌ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన గిట్టుబాటు ధర అందకుండా చేస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో మిల్లర్లను కాదని రైతులు నేరుగా ధాన్యం విక్రయించుకునేందుకు రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తే, వాటిని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. దీంతో ఇప్పుడు రైతులు వ్యయ ప్రయాసలకోర్చి మిల్లర్ల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. చేతికొచ్చిన పంట ఎప్పుడు కొంటారో తెలియని పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉందన్నారు. మరోవైపు ప్రకృతి వైపరీత్యాల కారణంగా ముందస్తు వరి కోతలు చేపట్టిన రైతులు, ధాన్యం ఎండబెట్టేందుకు పంట పొలాల్లో పండించిన ధాన్యానికి కాపలా కాయాల్సి వస్తోందన్నారు. తడిసిన ధాన్యం కొనే పరిస్థితి లేక రైతులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. రైతులకు గతంలో రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అందేదని, కూటమి ప్రభుత్వం దాన్ని అందించకుండా ముఖం చాటేసిందని విమర్శించారు. తక్షణమే పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు ప్రతి రైతుకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జెడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్‌కుమార్‌, నాయకులు పేరాడ తిలక్‌, చింతాడ రవికుమార్‌, అంబటి శ్రీనివాసరావు, గొండు రఘురాం, పీస గోపి, ఎం.వి పద్మావతి, దుంపల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️