వ్యవ’సాయం’ విస్మరించి అభివృద్ధి గొప్పలు

కూటమి ప్రభుత్వ నేతల మాటలు కోటలు

ప్రజాశక్తి-శ్రీకాకుళం ప్రతినిధి

కూటమి ప్రభుత్వ నేతల మాటలు కోటలు దాటుతున్నా, పనులు గడప దాటడం లేదు. వ్యవసాయంలో అంత జిడిడిపి సాధిస్తాం, ఇంత ఆదాయం సాధిస్తామంటూ ఐదేళ్లకు ప్రణాళికలు రూపొందించిన టిడిపి కూటమి ప్రభుత్వం ప్రస్తుతం రైతుల అవసరాలను తీర్చే విషయాన్ని విస్మరిస్తోంది. ఖరీఫ్‌లో పండిన పంటను కొనుగోలు చేయలేక రైతులను దళారుల దయాదాక్షిణ్యాలకు వదిలేసిన ప్రభుత్వం రబీలో నీరివ్వలేక చేతులెత్తేసింది. 2014-19 అధికారంలోకి వచ్చిన టిడిపి వంశధార ప్రాజెక్టు ఫేజ్‌-2 స్టేజ్‌-2 పనులను తన ఐదేళ్ల కాలం లో పూర్తి చేయలేకపోయింది. 2019-24 వరకు అధికారంలో ఉన్న వైసిపి హయాంలో పనులు పూర్తి కాలేదు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చిన టిడిపి కూటమి ప్రభుత్వం 2025-26 నాటికి పూర్తి చేస్తామని చెప్తోంది. ప్రాజెక్టు సకాలంలో పూర్తయి ఉంటే హిరమండలం రిజర్వాయర్‌లో 19 టిఎంసిల నీరు నిల్వకు అవకాశం ఉంది. నీటి ఖరీఫ్‌, రబీ పంటలకు పుష్కలంగా నీరివ్వొచ్చు. రబీలో వరి వేయొద్దని వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పాల్సిన దుస్థితి వచ్చేది కాదు. తమ ప్రాంతాలకు వంశధార నీటిని వదలాలని మంత్రి అచ్చెన్నాయుడుని రైతులు బతిమిలాడుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చేది కాదు. రబీలో సాధారణంగా అన్ని రకాల పంటలు కలిపి మొత్తం 1,98,493 ఎకరాల్లో సాగయ్యే పరిస్థితి ఉండగా ప్రస్తుతం 1,29, 695 ఎకరాల్లోనే (65 శాతం) రైతులు పంటలు వేయగలిగారు. రబీలో వరి సాధారణ సాగు 21,573 ఎకరాలు ఉండగా ప్రస్తుతం 10,208 ఎకరాల్లో (47శాతం) మాత్రమే వేయగలిగారు. ఖరీఫ్‌లోనూ రైతులు ఇవే అనుభవాలను ఎదుర్కున్నారు. వర్షాలు లేక వంశధా ర, నాగావళి నదులు ఎండిపోవడంతో కాలువల నుంచి చుక్క నీరు కూడా రాని పరిస్థితి నెలకొంది. వర్షాభావ పరిస్థితులు, వంశధార కాలువల ద్వారా పూర్తి స్థాయిలో నీటిని విడిచిపెట్టకపోవడంతో పంటలూ ఎండిపోయాయి. కనీసం పంట కాలువలనూ రిపేర్లు చేయలేకపోయారు. ప్రభుత్వం నుంచి రైతులకు ఏ విధమైన సాయం లేకపోయినా ఖరీఫ్‌ చివరిలో వాతావరణ పరిస్థితులు కొంత అనుకూలించడంతో ధాన్యం దిగుబడి కాస్తా బాగానే వచ్చింది. చివరి గింజ వరకు కొంటామంటూ వ్యవసాయ మంత్రి గొప్పగా ప్రకటించినా చి’వరి’లో మాత్రం చేతులెత్తేశారు. పండిన ధాన్యంలో ఇప్పటివరకు 64 శాతం మేరే సేకరించి మిగిలిన ధాన్యం కొనుగోలు కోసం రైతులు ఎదురు చూసేలా చేశారు. జిల్లాలో 2024 ఖరీఫ్‌ సీజన్‌లో తొమ్మిది లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. రైతుల అవసరాలు, తిండి గింజలకు పోను 7 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వరకు మార్కెట్‌లోకి రావొచ్చని భావించి 4.90 లక్షల టన్నులను సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటివరకు 4.80 లక్షల మెట్రిక్‌ టన్నులను మాత్రమే కొనుగోలు చేసి లక్ష్యం పూర్తయిన మండలాల్లో సేకరణ ఆపేశారు. రైతులు వద్ద ఇప్పటికీ వేల టన్నుల ధాన్యం ఉండిపోవడంతో ప్రభుత్వం ఎప్పుడు కొనుగోలు చేస్తుందా అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. పంటలకు నీళ్లివ్వకుండా, పండిన పంటను కొనుగోలు చేయకుండా వ్యవసాయంలో ఐదేళ్లలో రెండింతల జిడిపి సాధిస్తామంటూ ప్రభుత్వం గొప్పలు చెప్తోంది. జిల్లాలో వ్యవసాయం, అనుబంధ రంగాల ద్వారా ప్రస్తుతం రూ.12,376 కోట్ల జిడిడిపి వస్తుండగా 2028-29 నాటికి రూ.25,416 కోట్ల లక్ష్యం సాధిస్తామని ప్రభుత్వం తన విజన్‌ ప్లాన్‌లో పేర్కొంది. ఈ సంవత్సరం రైతుల ఆదాయం పెరగకుంటే ఈ ఎడాది జిడిపి వాటా తగ్గినట్టే. ప్రస్తుతం రైతులు కోరుకుంటున్న సాగు నీరు, పండిన పంటను కొనుగోలు చేయడం, పంటలకు గిట్టుబాటు ధర, మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించడం మాని ఐదేళ్లలో అంతా అభివృద్ధి చేస్తేస్తామని చెప్పడం అరచేతిలో వైకుంఠం చూపించడమే అవుతుంది.

➡️