యువత జీవితాలతో చెలగాటం

రాష్ట్రంలోని నిరుద్యోగ

కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలుపుతున్న వైసిపి నాయకులు

  • నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాలి
  • వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌
  • కలెక్టరేట్‌ వద్ద ‘యువత పోరు’

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

రాష్ట్రంలోని నిరుద్యోగ యువత, విద్యార్థుల జీవితాలతో టిడిపి కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌ విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువతకు రూ.మూడు వేలు భృతి ఇవ్వాలని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ వైసిపి చేపట్టిన యువత పోరులో భాగంగా నిరుద్యోగులు, విద్యార్థులు, వైసిపి శ్రేణులు నగరంలోని జ్యోతిరావు పూలే పార్కు నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శించారు. మెగా డిఎస్‌సి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన తొలి సంతకానికి నేటికీ అతీగతి లేకుండా పోయిందని విమర్శించారు. రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకపోవడంతో విడ్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసిపి ప్రభుత్వం విద్యార్థులను అన్నివిధాలుగా ఆదుకుందని చెప్పారు. విద్యార్థులకు క్రమం తప్పకుండా విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం నాటి పథకాలను అమలు చేయకుండా అర్ధాంతరంగా నిలుపుదల చేశారని విమర్శించారు. దీనివల్ల పేద విద్యార్థులకు చదువుకు దూరమవుతున్నారని చెప్పారు. మరోవైపు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు మాట్లాడడం లేదన్నారు. తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ విద్య, వైద్యరంగంలో ఉన్న రూ.నాలుగు వేల కోట్ల బకాయిలు చెల్లించలేని దౌర్భాగ్య స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని విమర్శించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో లోకేష్‌ రాసిన రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలవుతోందని ఆరోపించారు. అబద్దపు హామీలతో అధికారంలోకొచ్చిన కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయలేక చేతులెత్తేసిందని విమర్శించారు. అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావును కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్‌ కుమార్‌, నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు పేరాడ తిలక్‌, చింతాడ రవికుమార్‌, నాయకులు ధర్మాన కృష్ణచైతన్య, తమ్మినేని చిరంజీవి నాగ్‌, ఎం.వి స్వరూప్‌, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️