మాట్లాడుతున్న ఎమ్మెల్యే గొండు శంకర్
- ఎమ్మెల్యే గొండు శంకర్
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు విజవంతంగా నిర్వహించిన రథసప్తమి వేడుకల్లో జిల్లా యంత్రాంగం కృషి ప్రశంసనీయమని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని విశాఖ-ఎ కాలనీలో ఉన్న ఆయన క్యాంపు కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఈ ఉత్సవాల్లో సుమారు 1.20 లక్షల మంది యాత్రికులు సందర్శించినట్టు అధికారిక లెక్కల తెలిపాయని అన్నారు. ఎక్కడా ఎటువంటి అవాంచనీయ ఘటనలకు తావు లేకుండా యంత్రాంగం ఏర్పాట్లు చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర పండగగా ప్రకటించిన తర్వాత స్వల్ప వ్యవధిలోనే పక్కాగా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ వేడుకలపై శ్రద్ధ చూపిన కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏటా ఇదే తరహాలో మరింత మెరుగైన ఏర్పాట్లతో ఉత్సవాలు నిర్వహించేందుకు వీలుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రసాదం స్కీంలో చేర్చడం వల్ల అరసవల్లి ఆలయం మరింత అభివృద్ధి చేసేందుకు వీలవుతుందన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించిన సాంస్కృతిక వేడుకలతో పాటు క్రీడలు జిల్లా స్థాయిని పెంచాయన్నారు. రథసప్తమి రోజున ఆలయాన్ని సందర్శించుకునేందుకు యాత్రికులకు కల్పించిన సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో నగరాన్ని సుందరీకరణ చేపడుతున్నట్టు వివరించారు. సమావేశంలో టిడిపి నాయకులు రెడ్డి శంకర్ తదితరులు పాల్గొన్నారు.