మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవికుమార్
ఎమ్మెల్యే కూన రవికుమార్
ప్రజాశక్తి- ఆమదాలవలస
నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. మండలంలోని దన్నానపేట వద్ద ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యాన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో భాగంగా శుక్రవారం జాబ్‌మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలన్నారు. యువతులు నైపుణ్యాలను పెంపొందించేందుకు, ఉపాధి కల్పించేందుకు నియోజకవర్గంలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల, ఐటిఐను తొందరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలో నిర్మిస్తున్న మూలపేట పోర్టు, విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్‌పోర్టుకు కావాల్సినఉద్యోగాలకు యువతీ యువకులకు అవసరమైన శిక్షణలు అందించాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా జాబ్‌మేళాకు ఐదు ప్రయివేటు సంస్థల ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించారు. 113 మంది యువతీ యువకులు ఇంటర్వ్యూలు హాజరయ్యారు. వీరిలో 32 మంది వివిధ కంపెనీలకు ఎంపికయ్యారు. అనంతరం పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ లేఅవుట్లు, 2.0 హౌసింగ్ సర్వేపై రెవెన్యూ, హౌసింగ్, సచివాలయాల ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, మండల సచివాలయ సర్వేయర్లతో సమీక్షించారు. కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఉరిటి సాయికుమార్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ అన్నెపు గోపి, సిఇఒ విభాగాధిపతి శ్రీనివాసరావు ఎంపిటిసి గొర్లె సూర్యం, తహశీల్దార్ ఎస్.రాంబాబు పాల్గొన్నారు.