ప్రశ్నిస్తున్న వైసిపి కౌన్సిలర్లు
వైసిపి కౌన్సిలర్ల వాకౌట్
ప్రజాశక్తి- పలాస
ఫొటోకాల్ ఉల్లంఘన, సభ్యుల అభిప్రాయాలు తెలుసుకోకుండా అజెండాలో అభివృద్ధి కార్యక్రమాలు అజెండాలో పెట్టడంపై నిరసిస్తూ వైసిపి కౌన్సిలర్లు వాకౌట్ చేశారు. అంతకుముందే ఫొటోకాల్ ఉల్లంఘనపై సభ్యులు లేవనెత్తిన అంశంపై మున్సిపల్ ప్రథమ పౌరుడిగా తానూ బాధితుడేనని, ఫొటోకాల్ ఉల్లంఘన మరోసారి జరిగితే తానూ చైర్మన్ కుర్చీలో కూర్చోకుండా నిరసన తెలుపుతానని చైర్మన్ బల్ల గిరిబాబు స్పష్టం చేశారు. పలాస-కాశీబుగ్గ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ గిరిబాబు అధ్యక్షతన శనివారం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. అజెండా ప్రారంభించిన వెంటనే కౌన్సిలర్లు కర్రి మాధవరావు, దుర్గా శంకర్‌పండా, గుజ్జు జోగారావు, పప్పల ప్రసాద్, బెల్లాల శ్రీనివాసరావు మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధులు ద్వారా మున్సిపాలిటీలో పలు వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు అజెండాలో పొందుపరిచారని అన్నారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అయితే 15వ ఆర్థిక సంఘం నిధులపై కౌన్సిలర్లతో ముందుగా ఒక సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలూ తెలుసుకోవాలని అన్నారు. అలా కాకుండా కౌన్సిలర్లు అనే గౌరవం లేకుండా ఇష్టారాజ్యంగా పనులు పెట్టారని సభ దృష్టికి తీసుకొచ్చారు. గతంలో జనరల్ ఫండ్ ద్వారా ఆమోదం పొందిన పనులు, ఒక వార్డును మరో వార్డుగా మార్చి పనులు అజెండాలో పెట్టారని పేర్కొన్నారు. రూ.85 లక్షలు నిధులు వస్తే ఒక్కో వార్డుకు రూ.లక్ష, రెండు లక్షలు పనులు చేపట్టడం సరికాదన్నారు. ఎంత అవసరమైనా గంట ముందు అత్యవసర సమావేశం నిర్వహించే అవకాశం ఉందన్నారు. ఇలా అయితే ఎలా.. అని ప్రశ్నించారు. దీనిపై కమిషనర్ ఎన్.రామారావు సమాధానం చెబుతూ నిధులు వెనక్కి మళ్లే అవకాశం ఉందనే భావనతో సమయం లేకపోవడంతో సమాచారం లేకుండా తాము పంపించామని తెలిపారు. దీనిపై చైర్మన్ మాట్లాడుతూ అదే విషయం తానూ అడిగానని అన్నారు. దీనిపై వైసిపి సభ్యులు 1 నుంచి 4 అంశాలు వరకు తాము వ్యతిరేకిస్తున్నామని వాకౌట్ చేశారు. ఫొటోకాల్ ఉల్లంఘన, కౌన్సిలర్లు చెప్పకుండా పనులు చేపట్టడంపై హక్కులను కాలరాస్తున్నారని పెద్దగా నినాదాలు చేస్తూ… బయటకు వెళ్లిపోయారు. సభ్యులంతా వెళ్లిపోవడంతో 1 నుంచి 4 అంశాలు రద్దు చేసి మిగిలిన అంశాలను ఆమోదించినట్లు చైర్మన్ ప్రకటించారు. సమావేశంలో బోర చంద్రకళ, బి.సుజాత, బల్ల రేవతి, శార్వాన గీత, పోతనపల్లి ఉమాకుమారి, దుర్గాశంకర్‌పండా, పప్పల ప్రసాద్, కర్రి మధవరావు, కో-ఆప్షన్ సభ్యులు బమ్మిడి సంతోష్ పాల్గొన్నారు.