గ్రామాల అభివృద్ధే ధ్యేయం

గ్రామాల అభివృద్ధే

ఆమదాలవలస : శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే రవికుమార్‌ 

  • ఎమ్మెల్యే కూన రవికుమార్‌

ప్రజాశక్తి – ఆమదాలవలస, పొందూరు

గ్రామాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. మండలంలోని అక్కులపేట, శ్రీనివాసచార్యులపేటలో రూ.60.02 లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మించనున్న సిసి రోడ్లు, డ్రెయినేజీలకు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్కులపేటను పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. పరిశ్రమల స్థాపన జరిగితే నిరుద్యోగాన్ని నిర్మూలించవచ్చని చెప్పారు. శ్రీకాకుళం – పార్వతీపురం రోడ్డును నాలుగు లైన్ల రహదారిగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈసర్లపేట వద్ద ఉన్న ప్రభుత్వ భూమిలో 60 ఎకరాల విస్తీర్ణంలో 400 కెవి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి గతంలో తాను ప్రతిపాదనలు చేశానని గుర్తుచేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం ఆ ప్రతిపాదనను విస్మరించి ఆటకెక్కించిందన్నారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేసి పరిశ్రమలను తీసుకొచ్చేందుకు గ్రామస్తులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు బొడ్డేపల్లి గౌరీపతి, బొడ్డేపల్లి వసుమతి, ఎంపిటిసిలు బొడ్డేపల్లి సుగుణ, తమ్మినేని బాలామణి, బొడ్డేపల్లి లక్ష్మీనారాయణ, టిడిపి నాయకులు తమ్మినేని చంద్రశేఖర్‌, సనపల ఢిల్లేశ్వరరావు, నూక రాజు, ఆర్‌డబ్ల్యుఎస్‌ జెఇఇ చంద్రమౌళి, ఎపిఒ ఎస్‌.లక్ష్మీనరసమ్మ, కార్యదర్శి బగాది నాగరాజు పాల్గొన్నారు.కూటమి ప్రభుత్వంతోనే గ్రామ స్వరాజ్యం సాధ్యంకూటమి ప్రభుత్వంతోనే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధ్యపడుతుందని కూన రవికుమార్‌ అన్నారు. పొందూరులోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసిపి పాలనలో సచివాలయాలు, వాలంటీర్ల పేరుతో గ్రామాలను సర్వనాశనం చేశారని విమర్శించారు. గత టిడిపి ప్రభుత్వంలో వేసిన రోడ్లు తప్ప వైసిపి పాలనలో చేసిన అభివృద్ధి కనిపించలేదని ధ్వజమెత్తారు. సిసి రోడ్లు, కాలువల నిర్మాణం ద్వారా ఆరోగ్యవంతమైన గ్రామాలను నిర్మించవచ్చన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం మండలంలో ఎంఎస్‌ఎంఇలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన విద్యుత్‌ను అందించేందుకు మండలంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్ల ఏర్పాటు అవసరమన్నారు. చిలకపాలెం నుంచి రామభద్రపురం వరకు ఉన్న రాష్ట్ర రహదారిని జాతీయ రహదారులకు అప్పగించి నాలుగు లైన్ల రోడ్డుగా నిర్మించనున్నారని తెలిపారు. విజయవాడ వరద బాధితులకు యంగ్‌ స్టార్‌ యూత్‌ క్లబ్‌ ఆధ్వర్యాన గ్రామాల్లో సేకరించిన రూ.రెండు లక్షల చెక్కును క్లబ్‌ అధ్యక్షులు కె.శాంతారాం ఎమ్మెల్యేకు అందజేశారు. సమావేశంలో టిడిపి మండల అధ్యక్షులు రామ్మోహన్‌, నాయకులు అన్నెపు రాము, సీపాన శ్రీరంగనాయకులు, బలగ శంకర భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️