ప్రజాశక్తి – రణస్థలం : విశాఖ డెయిరీ తగ్గించిన ఆవు పాలు ధర వెంటనే పునరుద్ధరించాలని, పాలుకు గిట్టుబాటు ధర ఇవ్వాలని రైతు సంఘం నేత వెలమల రమణ డిమాండ్ చేసారు. దేవరాపల్లిలో ఆంధ్రప్రదేశ్ పాల రైతు సంఘం ఆధ్వర్యంలో పాలరైతుల సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ డెయిరీ యాజమాన్యం ఆవు పాలు ధర తగ్గించిందని అన్నారు. డెయిరీకి వచ్చిన లాభాలను డెయిరీ యాజమాన్యం ప్రతి సంవత్సరం వందలాది కోట్ల రూపాయలు వివిధ రూపాలలో అవినీతి, అక్రమాలు చేసి కాజేస్తున్నారు, నష్టాలు డెయిరీకి చూపిస్తున్నారని విమర్శించారు. విశాఖ డెయిరీ అభివృద్ధి చెంది, లాభాలతో అనేక అనుబంధ రంగాలు స్థాపించడానికి కీలకమైన పాల రైతులకు గిట్టుబాటు ధర, వచ్చిన లాభాలలో వాటా రైతులకు ఇవ్వడం లేదు, పాలకేంద్రాలలో సిబ్బందికి కనీస వేతనం ఇవ్వడం లేదు, సంఘాల ఆర్థిక పరిపుష్టికి న్యాయంగా ఇవ్వవలసినవి ఇవ్వకుండా యాజమాన్యం దోచుకుంటున్నదని అన్నారు. పశువుల దాణా, గడ్డి, మందులు, తదితర పెట్టుబడి పెరిగిపోతుంటే రైతులకు ఇచ్చే పాలధర పెంచాల్సిందిపోయి తగ్గించడం అన్యాయమన్నారు. ఆవుపాలు
తగ్గించిన ధర వల్ల లీటరుకు మూడు రూపాయలు నుండి నాలుగు రూపాయలు తగ్గుతుందని అన్నారు. పాలు కొనుగోలు చేసే ప్రజలకు (వినియోగదారులకు) అమ్మే పాలధర తగ్గించలేదని అన్నారు. రైతులు పాడి పశువులకు భీమా, పాల రైతులకు జనశ్రీ రైతు, సెంటర్ కట్టే ప్రీమియం, డెయిరీ తీసుకొని తమ వద్ద ఉంచు కుంటున్నారని, అదే సొసైటీ వద్ద ఉంచితే క్లైమ్ వెంటనే పరిష్కారం చేయవచ్చునని సెంటర్ కు ఆర్థిక పరిపుష్టి కలుగుతుందని అన్నారు. విశాఖ డెయిరీ పశువుల మందులు కొనుగోలులో కూడా కమిషన్లు మేనేజ్ మెంట్ కాజేస్తుందని విమర్శించారు. రైతులను దోపిడీ చేసి పాలకవర్గానికి రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాలు చేకూర్చే విధంగా నిర్ణయాలు చేస్తూ లక్షలమంది పాల రైతులను, సిబ్బందిని పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. పాలరైతులతో, సొసైటీలుతో చర్చించకుండా, ఏక పక్షంగా ఆవు పాల ధర తగ్గింపు గురించి నిర్ణయం చేశారు. ఈ విధంగా చేయటం సహకార స్ఫూర్తికే విరుద్ధంమన్నారు. సొసైటీ అధ్యక్షులు ఆవుపాల ధర తగ్గించి, రైతులకు ద్రోహం చేసిన డెయిరీ యాజమాన్యం చేసే అక్రమాలను ప్రశ్నించకుండా కొన్ని ప్రోత్సహకాలు, విహారయాత్రలతో ప్రలోభ పెడుతున్నారని అన్నారు. సహకార నిబంధనల ప్రకారం లాభాలలో నుంచి బోనస్ 2006 సంవత్సరం నుండి ఇవ్వడంలేదని, రైతు పాలకి ఇవ్వవలసిన డబ్బుల నుండి కొంత మినహాయించి ఆ డబ్బులనే బోనస్ గా ఇచ్చి రైతులను మోసగిస్తున్నారని పాల రైతులు డెయిరీ యాజమాన్యాన్ని నిలదీసి తగ్గించిన ధర వెనక్కి తీసుకోవాలని, రావలసిన ప్రయోజనాలు అన్నింటినీ రాబట్టేందుకు పాల రైతులందరూ ఐక్యంగా పోరాడి సాధించు కోవాలని తగ్గించిన ఆవు పాలు ధర వెంటనే వెనక్కి తీసుకోవాలని డిసెంబరు 2న గాజువాక వద్ద గల విశాఖ డెయిరీ వద్ద జరిగే మహా ధర్నా జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాడి రైతులు పాల్గొన్నారు.