నిరసన తెలుపుతున్న పాల రైతులు
ప్రజాశక్తి – రణస్థలం
విశాఖ డెయిరీ తగ్గించిన ఆవు పాల సేకరణ ధరను పెంచాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్.అమ్మన్నాయుడు, రైతు సంఘం నాయకులు వెలమల రమణ డిమాండ్ చేశారు. మండలంలోని ముక్తుంపురంలో పాల రైతుసంఘం ఆధ్వర్యాన పాడి రైతులు శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ డెయిరీ ఆవు పాల సేకరణ ధర లీటరుకు రూ.నాలుగు వరకు తగ్గించడం వల్ల పాడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. పశువులకు వైద్య, దాణా ఖర్చులు పెరిగిపోయి పాలు ధర గిట్టుబాటు కావడం లేదన్నారు. ఈ తరుణంలో ధర పెంచాల్సింది పోయి తగ్గించడం అన్యాయమన్నారు. అక్టోబర్ 29వ తేదీన విశాఖ డెయిరీ కేంద్ర కార్యాలయం వద్ద పాల రైతుసంఘం ఆధ్వర్యాన ధర్నా సమయంలో సమస్యల పరిష్కారానికి డెయిరీ జిఎం హామీనిచ్చినా, నేటికీ అమలుకు నోచుకోలేదన్నారు. విశాఖ డెయిరీకి ఏడు జిల్లాల నుంచి సుమారు 3.5 లక్షల మంది రైతులు తొమ్మిది లక్షల లీటర్ల పాలు పోస్తున్నారని చెప్పారు. రైతుల శ్రమతో అభివృద్ధి చెందిన డెయిరీకి రూ.వేల కోట్ల ఆస్తులు సమకూరినా, మార్కెట్‌లో మంచి బ్రాండ్ ఇమేజ్ వచ్చినా… అభివృద్ధిలో వచ్చిన ఫలాలు రైతులకు దక్కకుండా దారిమళ్లిస్తోందని విమర్శించారు. ఆవు పాలు 3.5 శాతం వెన్నకు రైతుకు రూ.34 చెల్లిస్తున్నారని, అవే పాలు మార్కెట్‌లో వెన్న శాతం తగ్గించి రూ.54కు అమ్ముతున్నారని తెలిపారు. 5.5 శాతం వెన్నకి రూ.38 రైతుకు చెల్లిస్తూ అవే పాలు రూ.64కు విక్రయిస్తోందన్నారు. కొనుగోలు, అమ్మకం ధరకు వ్యత్యాసం లీటరుకు రూ.24 వరకు ఉందన్నారు. నిర్వహణ ఖర్చు లీటరుకు రూ.10 తీసేసినా, రూ.14 మిగులుతుందన్నారు. అందులో రూ.10 రైతుకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డెయిరీలో అవినీతిపై విచారణ చేసి నిందితులను శిక్షించాలన్నారు. డెయిరీ ఆస్తులను కాపాడడంతో పాటు సహకార చట్టం పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆవు పాల సేకరణ ధర పెంచాలని కోరుతూ ఈనెల 16న శ్రీకాకుళంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో నిర్వహించే సదస్సును జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో కె.అప్పలనాయుడు, కలిశెట్టి సన్యాసప్పలనాయుడు, సిహెచ్.పాపయ్య, టి.పైడిరాజు, సూరమ్మ, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.