విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే శంకర్
- ఎమ్మెల్యే గొండు శంకర్
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
గాంధేయవాదిగా స్వాతంత్య్ర పోరాటంలో కీలకపాత్ర పోషించడంతో పాటు రైతుల కోసం అలుపెరగని ఉద్యమాలతో వెన్నంటి నిలిచిన మహోన్నత వ్యక్తి ఆచార్య ఎన్.జి రంగా అని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న గాంధీజీ స్మతివనంలో ఎన్.జి రంగా 124వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయ పాఠశాల ప్రారంభించి ఎందరికో రాజకీయ గురువుగా నిలిచిన స్ఫూర్తిదాత అని కొనియాడారు. శ్రీకాకుళం జిల్లాతో రంగాకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. పార్లమెంట్ సభ్యునిగా 60 ఏళ్లపాటు ప్రాతినిధ్యం వహించి గిన్నిస్ రికార్డు నెలకొల్పిన ఏకైక వ్యక్తి అని కొనియాడారు. జిల్లా నుంచి ఒకసారి పార్లమెంట్ సభ్యునిగా సేవలందించి ప్రజల మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల స్మతివనంలో మహనీయుల స్ఫూర్తి భావితరాలకు అందేలా చేస్తున్న కృషి ఎంతో గొప్పదని మాజీ మంత్రి త్రిపురాన వెంకటరత్నం అన్నారు. అనంతరం విగ్రహదాత త్రిపురాన వెంకటరత్నం, ఎమ్మెల్యే గొండు శంకర్‌ను గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు సత్కరించారు. అవధాన పండితులు పైడి హరనాథరావు ఎన్‌జి రంగా గొప్పతనాన్ని కీర్తిస్తూ గేయాన్ని ఆలపించారు. తొలుత గాంధీ మందిరంలో బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు సురంగి మోహనరావు, జామి భీమశంకర్, నటుకుల మోహన్, కొంక్యాన వేణుగోపాల్, పొన్నాడ రవికుమార్, ఎం.వి.వి.ఎస్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.