మాట్లాడుతున్న ఎస్‌పి మహేశ్వర రెడ్డి
ప్రజాశక్తి – అరసవల్లి
కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా కోర్టు విధుల్లో ఉండే కోర్టు ఎఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్లు ప్రతిభ కనబరచాలని ఎస్‌పి కె.వి మహేశ్వర రెడ్డి కోర్టు లైజినింగ్ అధికారులకు సూచించారు. పోలీస్ శాఖలో కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర చాలా కీలకమన్నారు. జిల్లావ్యాప్తంగా పలు కోర్టుల్లో విధులు నిర్వహిస్తున్న కోర్టు ఎఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్లతో జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాలకు పాల్పడిన నిందితులకు శిక్ష పడినప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. సాక్షులను సకాలంలో న్యాయస్థానంలో హాజరు పరుస్తూ కోర్టు కానిస్టేబుళ్లు తీసుకోవాల్సిన చొరవే అతి ముఖ్యమైందని తెలిపారు. కోర్టు జారీ చేసిన వారెంట్లు, సమన్లు నేరస్తులకు సత్వరమే అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కోర్టు ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత సిఐలు, ఎస్‌ఐలకు తెలియజేయాలని సూచించారు. కేసు ట్రయల్స్ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సలహాలు, సూచనలు స్వీకరించాలని ఆదేశించారు. కోర్టు పెండింగ్ ట్రయల్ కేసులు, వారెంట్లు, సమన్లు, సిసిటిఎన్‌ఎస్ అప్లికేషన్, కోర్టు మానిటర్ సిస్టమ్‌లో డేటా ఎంటర్ చేయాలన్నారు. సమావేశంలో కోర్టు మానిటరింగ్ సిస్టమ్ ఎస్‌ఐ కోటేశ్వరరావు, ఎఎస్‌ఐలు, కోర్టు హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.