మూడో వేతన సవరణ చేపట్టాలి

బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల మూడో వేతన సవరణ తక్షణమే

ధర్నా చేస్తున్న బిఎస్‌ఎల్‌ఎల్‌ ఉద్యోగులు

బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల ధర్నా

ప్రజాశక్తి – శ్రీకాకుళం

బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల మూడో వేతన సవరణ తక్షణమే ప్రకటించాలని, పెన్షన్‌ రివిజన్‌తో పాటు 4జి, 5జి సేవలు అందుబాటులోకి తీసుకురావాలని బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.గోవర్థనరావు, పి.వెంకటరావు డిమాండ్‌ చేశారు. ఇవే డిమాండ్లపై ఆలిండియా బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌, ఆలిండియా బిఎస్‌ఎన్‌ఎల్‌ డాట్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌, క్యాజువల్‌, కాంట్రాక్టు వర్కర్సు ఫెడరేషన్‌ సంయుక్తంగా నగరంలోని సంచార్‌ భవన్‌ వద్ద బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులకు 2017 జనవరి నుంచి 15 శాతం ఫిట్‌మెంటుతో వేతన సవరణ జరగాల్సి ఉన్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు పదేళ్లకోసారి వేతన సవరణ జరగాల్సి ఉన్నా, 17 ఏళ్లుగా పట్టించుకోవడం లేదన్నారు. పెన్షనర్లకు పెన్షన్‌ రివిజన్‌ అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు ప్రైవేటు ఆపరేటర్లు వారి సేవలను విస్తరించేందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సంస్థ ద్వారా సహకరిస్తున్నారని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు అనువైన పరిస్థితులున్నా 4జి, 5జి సేవలను బిఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ వినియోగదారులకు విస్తరించకుండా సంస్థను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రైవేటు ఆపరేటర్లు మొబైల్‌ టారిఫ్‌లను ఇష్టారాజ్యంగా పెంచుతున్నారని, దీనివల్ల మధ్య, చిన్నతరహా వినియోగదారులకు మోయలేనంత భారం పడుతుందన్నారు. తక్షణమే ఈ సేవలను అందుబాటులోకి తేవాలని డిమాండ్‌ చేశారు. సంస్థలో పనిచేస్తున్న క్యాజువల్‌ కాంట్రాక్టు వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సంఘాల నాయకులు అభిమన్యు, లక్ష్మి, అరుణ, గోపాలరావు, వెంకటరావు పాణిగ్రహి, చరణ్‌, డి.శ్రీనివాసరావు, కె.గోపాలరావు, శారద తదితరులు పాల్గొన్నారు.

 

➡️