శ్రమజీవుల గళమై…

పారిశ్రామిక కార్మికులు, స్కీమ్‌వర్కర్లు

రిలే నిరాహార దీక్షలు చేస్తున్న శ్యామ్‌పిస్టన్స్‌ ప్లాంట్‌-2 కార్మికులు (ఫైల్‌) 

  • పారిశ్రామిక కార్మికుల పోరాటాల్లో సిపిఎం
  • వేతన ఒప్పందాల అమలుకు అలుపెరగని పోరు
  • స్కీమ్‌వర్కర్ల సమస్యలపై పోరాటం

పారిశ్రామిక కార్మికులు, స్కీమ్‌వర్కర్లు తమ సమస్యలపై సాగిస్తున్న పోరాటాల్లో సిపిఎం ముందుపీఠిన నిలబడింది. వేతన ఒప్పందాలను అమలు చేయకుండా మొండికేసిన యాజమాన్యాలు దిగొచ్చేలా చేయడంలో తనవంతు పాత్ర పోషించింది. పరిశ్రమల నుంచి అన్యాయంగా తొలగించిన కార్మికులను తిరిగి పనుల్లో తీసుకునేలా చేసేందుకు అనేక ఆందోళనలు చేపట్టింది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు చేర్చడంలో అహర్నిశలు శ్రమిస్తున్న స్కీమ్‌వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, రెగ్యులరైజ్‌, కనీస వేతనాలు చెల్లించాలంటూ గొంతెత్తింది. ఈనెల 9, 10 తేదీల్లో పలాసలో సిపిఎం 18వ జిల్లా మహాసభల నేపథ్యంలో పారిశ్రామిక కార్మికులు, స్కీమ్‌వర్కర్ల సమస్యలపై సిపిఎం సాగించిన పోరాటాలపై ప్రత్యేక కథనం.

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

రణస్థలం మండలం శ్యామ్‌పిస్టన్స్‌ ప్లాంట్‌-2లో 30 ఏళ్లు పూర్తయిన కార్మికులను తొలగించేందుకు యాజమాన్యం ప్రయత్నించిన సందర్భంలో సిఐటియు ఆధ్యర్యాన కార్మికులు పలురూపాల్లో ఆందోళనలు చేపట్టారు. ప్రస్తుతం కల్పిస్తున్న 14 రోజుల పని దినాలు కాకుండా పూర్తిస్థాయిలో పని కల్పించడం కోసం మరోవైపు న్యాయ పోరాటం సాగిస్తోంది. సిఐటియు చేసిన సాగించిన పోరాటాల ఫలితంగా నాగార్జున అగ్రికమ్‌ పరిశ్రమలో వేతన ఒప్పందానికి యాజమాన్యం ముందుకొచ్చింది. యునైటెడ్‌ బేవరేజెస్‌లో కార్మికులకు ఇప్పుడు కల్పిస్తున్న 13 రోజుల పనిదినాలు కాకుండా పూర్తిస్థాయి పనిదినాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ పలురూపాల్లో ఆందోళనలు చేపట్టారు. కార్మికశాఖ అధికారులు జోక్యం చేసుకుని ఈ అంశంపై చర్చిస్తున్నారు. పారిశ్రామిక కార్మికులు సాగించిన పోరాటాలన్నింటికీ సిపిఎం అండగా నిలిచింది.

స్కీమ్‌వర్కర్ల పోరాటాలకు మద్దతు

అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్ల సాధనకు ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో అనివార్యంగా సమ్మెకు దిగాల్సి వచ్చింది. గతేడాది డిసెంబర్‌ 12 నుంచి ఈ ఏడాది జనవరి 22 వరకు 42 రోజుల పాటు సమ్మె చేశారు. సమ్మెలో భాగంగా ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, భిక్షాటన, వంటావార్పు, కొవ్వొత్తుల ర్యాలీ, సత్యాగ్రహ దీక్షలు, 24 గంటల నిరాహార దీక్షలు వంటి రూపాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఇళ్లను ముట్టడించడం, ఎమ్మెల్యేల జిల్లా వంటావార్పు, కలెక్టరేట్‌ వద్ద బైఠాయింపు వంటి కార్యక్రమాలతో ప్రభుత్వానికి తమ నిరసనను తెలిపారు. ఒకనొక దశలో వారిని తొలగించేందుకు సిద్ధపడిన తరుణంలో సిపిఎం మద్దతుగా నిలిచి పోరాటాన్ని ఉధృతం చేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఎన్నికల తర్వాత వారి డిమాండ్లను నెరవేరుస్తామంటూ హామీనిచ్చింది. ఆశావర్కర్ల సమస్యలపై గతేడాది డిసెంబర్‌ 13 నుంచి రెండు రోజుల పాటు 36 గంటల ధర్నా, 15న కలెక్టరేట్‌ ముట్టడి చేపట్టారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో డిఇఒ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం చెల్లింపు తదితర అంశాలపై కార్మికులు 2022 మార్చి 14న చేపట్టిన చలో విజయవాడను పోలీసుల సాయంతో భగం చేసింది. గృహ నిర్భంధాలు, ముందస్తు అరెస్టులకు పాల్పడింది. అదేరోజున అంగన్‌వాడీలు తమ సమస్యలపై విజయవాడలో చేపట్టనున్న మూడు రిలే దీక్షలకు జిల్లా నుంచి బయలుదేరి వెళ్తారన్న సమాచారంతో అంగన్‌వాడీ కార్యకర్తలపై ప్రభుత్వం నిర్బంధించింది. చలో విజయవాడకు ఆశా కార్యకర్తలు బయలుదేరకపోయినా ప్రభుత్వం వారిని గృహ నిర్బంధాలకు పాల్పడింది. స్కీమ్‌వర్కర్ల అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలను సిపిఎం నిర్ద్వందంగా ఖండించి వారి పోరాటాలకు సంఘీభావం తెలిపింది.

అసంఘటితరంగ కార్మికులకు అండగా…

భవన నిర్మాణ కార్మికులపై భవన నిర్మాణ కార్మిక సంఘం అలుపెరగని పోరాటాలూ చేస్తూనే ఉంది. భవన నిర్మాణాల ద్వారా సమకూరిన సెస్‌ను కార్మికుల సంక్షేమానికే కేటాయించాలంటూ అప్పటి శాసనసభాపతి తమ్మినేని సీతారాంకు వినతిపత్రం అందించారు. మందస మండలం సారంగిపురం రైస్‌మిల్లు డ్రైవర్లు తమకు వేతనం పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఈ ఏడాది జనవరిలో మూడు రోజుల పాటు సమ్మె చేశారు. సిఐటియు చేసిన ఆందోళనల ఫలితంగా డ్రైవర్ల వేతనాలు పెరిగాయి. ఆచార్య ఎన్‌జి రంగా విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం మండలం రాగోలు వ్యవసాయ పరిశోధనా కేంద్రం, ఆమదాలవలస కెవికెలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కారం కోసం ఏడు రోజుల పాటు చేపట్టిన సమ్మెకు సిఐటియు మద్దతు పలికింది. మున్సిపల్‌ కార్మికులు గతేడాది డిసెంబరు 26 నుంచి జనవరి 12 వరకు 16 రోజల పాటు చేపట్టిన సమ్మెకు సిపిఎం తన సంపూర్ణ మద్దతు తెలిపింది. సమగ్ర శిక్ష ఉద్యోగులు గతేడాది డిసెంబర్‌ 20 నుంచి ఈ ఏడాది జనవరి 12 వరకు 22 రోజుల పాటు చేపట్టిన సమ్మెకు సిఐటియు మద్దతుగా నిలిచింది. జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న రైస్‌ మిల్లు కార్మికుల సమస్యలపై ఫిబ్రవరి 26న కల్టెరేట్‌ వద్ద సిఐటియు ఆధ్వర్యాన కార్మికులు ధర్నా చేశారు. వీరందరి ఆందోళనల వెనుక సిపిఎం వెన్నంటి ఉండి వారి సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి సల్పుతోంది.

➡️