సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి

రాష్ట్ర ప్రభుత్వం

మాట్లాడుతున్న భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింహారావు

  • భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వి నర్సింహారావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును తక్షణమే పునరుద్ధరించి, గతంలో ఉన్న సంక్షేమ పథకాలను అమలు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వి.నర్సింహారావు డిమాండ్‌ చేశారు. నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీలో సమావేశంలో ఆయన మాట్లాడారు. టిడిపి కూటమి ఎన్నికల సమయంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి, పెండింగ్‌ క్లయిమ్స్‌ పరిష్కరిస్తామని మేనిఫెస్టోలో పేర్కొందని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలైనా ఆ హామీలు అమలుకు నోచుకోలేదని, కార్మికులపై ప్రభుత్వ వైఖరి అర్థమవుతోందన్నారు. కార్మిక వర్గాన్ని నమ్మించి మోసగించడం పాలకులకు పరిపాటిగా మారిందన్నారు. సంక్షేమ బోర్డుని పునరుద్ధరించి, పెండింగ్‌ క్ల్లయిమ్‌లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల అమలు కోసం వసూలు చేసిన సెస్‌ నిధులను కార్మికుల సంక్షేమానికే ఖర్చు చేయాలన్నారు. ఈ నిధులను ప్రభుత్వాలు పలు సందర్భాల్లో దారిమళ్లించాయని, వాటిని తిరిగి సంక్షేమ బోర్డుకు జమ చేయాలన్నారు. అర్హులైన భవన నిర్మాణ కార్మికుల్లో సొంతింటి నిర్మాణానికి వెల్ఫేర్‌ బోర్డు నుంచి రాయితీపై రుణం ఇవ్వాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధంగా భవన నిర్మాణాల కార్మికులకు మెరుగైన సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు స్కాలర్‌షిప్‌ అందించాలని, కార్మికుల పనికోసం వేచి ఉండే ప్రదేశాల్లో కనీస మౌలిక సదుపాయలు కల్పించాలన్నారు. నిర్మాణం పనులకు ఉపయోగించే వస్తువులపై (ముడిసరుకులు) జిఎస్‌టిని తగ్గించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసేందుకు సిద్ధమవుతున్న లేబర్‌ కోడ్‌లు భవన నిర్మాణ కార్మికులకు నష్టదాయకం కానున్నాయన్నారు. లేబర్‌ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.హరనాథరావు, గౌరవాధ్యక్షులు ఎం.ఆదినారాయణ మూర్తి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, సంఘ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

➡️