హోంగార్డుల సంక్షేమానికి ప్రాధాన్యం

జిల్లా ఆర్మ్డ్‌ రిజర్వ్‌

మెడల్స్‌ అందజేస్తున్న ఎస్‌పి మహేశ్వర రెడ్డి

  • ఎస్‌పి కె.వి మహేశ్వర రెడ్డి

ప్రజాశక్తి- ఎచ్చెర్ల

నీతి నిజాయితీతో అప్పగించిన విధులు బాధ్యత, అంకితభావంతో నిర్వర్తించి, నూతనోత్తేజంతో మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందించాలని ఎస్‌పి కె.వి.మహేశ్వర రెడ్డి అన్నారు. ఎచ్చెర్ల జిల్లా ఆర్మ్డ్‌ రిజర్వ్‌ పోలీస్‌ మైదానంలో శుక్రవారం నిర్వహించిన 62వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. ముందుగా పరేడ్‌ కమాండర్‌ హోంగార్డు శశిభూషణ్‌ ఎస్‌పికి గౌరవ వందన్నాన్ని సమర్పించారు. అనంతరం పరేడ్‌ కమాండర్‌ ఆధ్వర్యాన నిర్వహించిన రైజింగ్‌ డే పరేడ్‌ను ఎస్‌పి తిలకించారు. పరేడ్‌ నిర్వాహణలో 2,3 ప్లేటెన్లు ప్రథమ, ద్వితీయ బహుమతులను గెలుచుకున్నా రు. పరేడ్‌ కమాండర్‌, ప్లేటెన్లు కమాండర్‌, సిబ్బందికి మెడల్స్‌ వేసి సత్కరించారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డు అప్పలనాయుడు సతీమణి పి.భారతికి హోంగార్డులు ఒక రోజు వేతనం రూ.4.50 లక్షలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1962లో ఓ కొద్ది మందితో స్వచ్ఛంద సంస్థగా ఏర్పడిన హోంగార్డు ఆర్గనైజేషన్‌ ఇప్పుడు జిల్లాలో 751 మంది మహిళా, పురుష హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. హోంగార్డులు సివిల్‌, ఎఆర్‌ పోలీస్‌ సిబ్బంది కంటే ఎక్కువ ఏమీ కాదని అన్నారు. ఇటీవల గార పోలీస్‌స్టేషన్‌లో రాత్రి విధుల్లో ఉన్న మహిళా హోంగార్డు రాజేశ్వరి పాముకాటుకు గురైన మహిళను గుర్తించి 108 సిబ్బందితో ప్రథమ చికిత్స అందించి ప్రాణాన్ని రక్షించేటట్లు చర్యలు తీసుకోవడం ఆమె గొప్పతనానికి నిదర్శనమని అన్నారు. విధి నిర్వహణలో మృతి చెందిన హోంగార్డులకు ప్రమాద బీమా కింద రూ.పది లక్షల వరకు వర్తించేటట్లు చర్యలు తీసుకున్నమని, ఇందుకు సహకరించిన డాక్టర్‌ దానేటి శ్రీధర్‌, సూడ చైర్మన్‌ కోరిగాన రవికుమార్‌ సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం 35 ఏళ్లు సర్వీస్‌ పూర్తి చేసుకున్న కృష్ణవేణి, రాజు, కృష్ణమ్మ, విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అనురాధ, విశాలాక్షికు దుశ్శాలువ కప్పి సన్మానించారు. కార్యక్రమంలో డిఎస్‌పిలు వివేకానంద, శేషాద్రి, ప్రసాదరావు, సిఐలు ఇమ్మాన్యువల్‌ రాజు, అవతారం, ఆర్‌ఐ నర్సింగరావు పాల్గొన్నారు.

➡️