కరెంట్‌ ఛార్జీలు…తగ్గిస్తామని పెంచుతున్నారు

గత ప్రభుత్వం ఐదేళ్ల

ర్యాలీగా వెళ్తున్న సిపిఎం నాయకులు

  • విద్యుత్‌ భారాలు మోపుతున్న కూటమి ప్రభుత్వం
  • వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్‌ మీటర్లు తొలగించాలి
  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌

ప్రజాశక్తి – సోంపేట

గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో పలురూపాల్లో మోపిన విద్యుత్‌, ఇతర భారాలను తగ్గిస్తామని, కరెంటు ఛార్జీలు పెంచబోమని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ అధికారంలోకి వచ్చిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌ అన్నారు. ఆ హామీకి భిన్నంగా విద్యుత్‌ ఇంధన సర్దుబాటు ఛార్జీలు 2022-23 సంవత్సరానికి సుమారు రూ.6,072 కోట్ల భారం మోపుతూ విద్యుత్‌ నియంత్రణ మండలి నోటిఫికేషన్‌ జారీ చేసిందని తెలిపారు. సోంపేట మండల కేంద్రంలోని ఒక కళ్యాణ మండపంలో ఆ పార్టీ మండల మహాసభను ఆదివారం నిర్వహించారు. ప్రభుత్వాస్పత్రి వద్ద నుంచి గాంధీ మండపం కూడలి మీదుగా కవిటి రోడ్డులోని శైలజ కళ్యాణ మండపం వరకు ర్యాలీ నిర్వహించారు. పార్టీ పతాకాన్ని సీనియర్‌ నాయకులు దుంపల కృష్ణారావు ఆవిష్కరించారు. ఇటీవల మరణించిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరవీరులకు సంతాపం తెలియజేస్తూ మౌనం పాటించారు. అనంతరం నిర్వహించిన సభలో తులసీదాస్‌ మాట్లాడుతూ 2023-24 సంవత్సరానికి సంబంధించి మరో రూ.11 వేల కోట్లకు పైగా సర్దుబాటు విద్యుత్‌ ఛార్జీల భారం మోపబోతోందని వార్తలు వస్తున్నాయన్నారు. సుమారు రూ.20 వేల కోట్ల భారం రాష్ట్ర ప్రజలపై పడబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు విద్యుత్‌ కంపెనీల దోపిడీ, అధిక రేట్లకు పవర్‌ ఎక్స్ఛేంజ్‌లో స్వల్పకాలిక విద్యుత్‌ కొనుగోలు, పలు స్థాయిల్లో అవినీతి, అపసవ్య విధానాలతో విద్యుత్‌ వ్యయం పెరుగుతోందని తెలిపారు. ఆ భారాన్ని సర్దుబాటు ఛార్జీల రూపంలో జనం నెత్తిన వేయడం అసమంజసమన్నారు. నిత్యావసర సరుకుల ధరలు సామాన్యులకు అందుబాటులో లేని విధంగా ఆకాశాన్ని తాకుతున్న దశలో ప్రజలకు ఉపశమనం కలిగించాల్సింది పోయి, అదనపు భారాలు మోపడం సరికాదన్నారు. ఏనాడో వాడుకున్న విద్యుత్‌కు తర్వాత కాలంలో సర్దుబాటు ఛార్జీల విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సర్దుబాటు ఛార్జీల ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. గత ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు బిగించిన స్మార్ట్‌ మీటర్లు తొలగిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.మోహనరావు మాట్లాడుతూ టిడిపి కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులను మోసం చేస్తున్న సోంపేటలోని గోల్డ్‌ ల్యాండ్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్నారు. జీడి, కొబ్బరి పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతుసేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. అనంతరం సిపిఎం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల కార్యదర్శిగా సంగారు లకీëనారాయణ, కమిటీ సభ్యులుగా జుత్తు సింహాచలం, దున్న యామయ్య, షణ్ముఖరావు, ధర్మారావు, చిరంజీవిని ఎన్నుకున్నారు. మహాసభలో సిపిఎం నాయకులు టి.పాపారావు, డి.హేమయ్య, పి.చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

➡️