దొరికిన దేవాలయ చోరీల దొంగలు

ఆలయాల్లో వరుస దొంగతనాలకు

వివరాలను వెల్లడిస్తున్న ఎస్‌పి మహేశ్వర రెడ్డి

  • పోలీసులకు పట్టుబడిన ముఠా
  • రూ.91.38 లక్షల సొత్తు రికవరీ
  • ఎస్‌పి కె.వి మహేశ్వర రెడ్డి

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

ఆలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ.91.38 లక్షల సొత్తును రికవరీ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌పి కె.వి మహేశ్వర రెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జిల్లాలో 2021 నుంచి వరుసగా చోటుచేసుకుంటున్న ఆలయాల నేరాలపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించి ఎనిమిది బృందాలతో రంగంలోకి దిగారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టి సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో కొన్ని కేసులను చేధించారు. దొంగతనాల్లో మొత్తం తొమ్మిది మంది భాగస్వామ్యమైనట్లు పోలీసులు నిర్ధారించారు. వీరిలో నలుగురు కోనసీమ జిల్లాలో అరెస్టయ్యారు. వీరు సీతంపేట, ఎల్‌.ఎన్‌.పేట, హిరమండలం, పార్వతీపురం మన్యం, తెలంగాణలోని మెదక్‌కు చెందిన వారుగా గుర్తించారు. వీరిలో ఆరుగురిని అరెస్టు చేయగా, మరో ముగ్గురిని అదుపులో తీసుకోనున్నారు. జిల్లాలో 39 నేరాలు, విశాఖపట్నం, కోనసీమ జిల్లాల్లో చెరొకటి, తెలంగాణ రాష్ట్రం మెదక్‌లో రెండు నేరాలు కలిపి మొత్తం 43 దొంగతనం కేసుల్లో వీరు ఉన్నట్లు తేల్చారు. జిల్లావ్యాప్తంగా 32 ఆలయ నేరాలు, 3 రైస్‌మిల్లుల నేరాలు, నాలుగు గృహ నేరాలతో మొత్తం 39 నేరాలకు పాల్పడ్డారు. పట్టుబడిన వారి నుంచి 692 గ్రాముల బంగారు ఆభరణాలు, 52 కేజీల 880 గ్రాముల వెండి ఆభరణాలు (వస్తువులు), రూ.3,38,570 నగదు, నాలుగు మోటర్‌ బైక్‌లు, రెండు కట్టర్స్‌, గునపాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.91.38 లక్షలుగా నిర్ధారించారు. దొంగిలించిన సొమ్ముతో కొనుగోలు చేసిన కారును అమలాపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నేరం ఇలా చేశారు…సిసి కెమెరాలు లేని ఆలయాలే లక్ష్యంగా వీరు దొంగతనాలకు పాల్పడినట్లు ఎస్‌పి వివరించారు. సిసి కెమెరాలు ఉంటే వాటిని కట్టర్స్‌, ఇతర పరికరాలను ఉపయోగించి నేరాలు చేస్తుంటారని తెలిపారు. సిసి కెమెరాల డివిఆర్‌లను ఎత్తుకుపోయి నీటిలో పడేసేవారని చెప్పారు. జన సంచారం లేని ఆలయాల వద్ద రెక్కీ నిర్వహించి నేరాలకు పాల్పడ్డారని తెలిపారు. పొందూరు మండలం నందివాడలో దుర్గామాత, ఎచ్చెర్ల మండలంలోని శ్రీచక్ర ఆలయం, కోటబొమ్మాలి మండలంలో సాయిబాబా, శివాలయం, గారలో వెంకటేశ్వర, సాయిబాబా ఆలయాలు, శ్రీకాకుళం నగరంలోని అమ్మవారి ఆలయంతో పాటు పలు ఆలయాల్లో వీరు దొంగతనాలు చేశారని తెలిపారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలిదొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌పి హెచ్చరించారు. ఆలయాలు, వ్యాపార, గృహ సముదాయాల వద్ద తప్పకుండా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆలయాల్లోని ఆభరణాలు, హుండీలో నగదును భద్రపరుచుకోవాలని, అవసరమైతే భద్రత కోసం గార్డులను నియమించుకోవాలని సూచించారు.పోలీసులకు అభినందనదొంగతనం కేసులను చేధించడంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకోవడంలో, భారీస్థాయిలో కేసు ప్రాపర్టీ స్వాధీనం చేసుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన శ్రీకాకుళం డిఎస్‌పి సిహెచ్‌.వివేకానంద, సిఐలు అవతారం, జె.శ్రీనివాసరావు, ఎస్‌ఐలు సందీప్‌ కుమార్‌, లక్ష్మణరావు, నిహార్‌, వెంకటరావుతో పాటు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.

➡️