ఉద్యోగ భద్రత కల్పించాలి

రాష్ట్రవ్యాప్తంగా పశుసంవర్థకశాఖలో

మాట్లాడుతున్న తేజేశ్వరరావు

సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

రాష్ట్రవ్యాప్తంగా పశుసంవర్థకశాఖలో నిలుపుదల చేసిన 1962 వాహనాల ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, 1962 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఐ.లక్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి ఆర్‌.మోహనరావులు ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు. నగరంలోని ఇందిరానగర్‌లో ఉన్న సిఐటియు కార్యాలయంలో ఆదివారం పశుసంవర్థకశాఖలో తొలగించిన పశుసంచార వాహన ఉద్యోగుల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారు మాట్లాడుతూ సంచార పశుఆరోగ్య సేవల వాహనాలు జిల్లాలో 18 ఉన్నాయని, వాటిని ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి నిలిపివేసి వాహనాలను పశుసంవర్థకశాఖ సహాయ సంచాలకుడికి అప్పగించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చిందని అన్నారు. టెర్మినేషన్‌ ఆర్డర్స్‌ కూడా జారీ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో వాహనంలో ముగ్గురు చొప్పన సిబ్బంది పనిచేసేవారమ అన్నారు. డ్రైవర్‌, పారవిట్‌, పశువైద్యుడు పని చేశారని చెప్పారు. తొమ్మిది వాహనాలకు ఒక రిలీవర్‌ కూడా పనిచేశారని వివరించారు. అయితే ఉన్నపళంగా తమను విధుల నుంచి తొలగించడంతో ఏ విధంగా వారి కుటుంబాలు బతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జిల్లాలో ఆమదాలవలస, పాతపట్నం, ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, శ్రీకాకుళం, ఎచ్చెర్ల మండలాలకు చెందిన వాహనాలను నిలిపివేయడంతో రైతులకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గత మూడేళ్లుగా చిత్తశుద్ధితో విధులు నిర్వహించామని, ఉన్నపళంగా విధుల నుంచి తొలగించడంతో తమతో పాటు తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. పశుసంవర్థకశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించి ఉద్యోగులు అందరినీ వెంటనే విధుల్లోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో 1962 ఉద్యోగుల సంఘం జిల్లా కోశాధికారి జి.పావని, నాయకులు పి.శ్వేత, వి.కృష్ణ, జి.రోహిత్‌, యు.జయకృష్ణ, డి.ధర్మారావు, ఇ.రవి, బి.నరేంద్ర, ఎం.హరి పాల్గొన్నారు.

 

➡️