ఈదుపురం పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న తహశీల్దార్
347 సంఘాలకు ఎన్నికలు
4.20 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్న ఓటర్లు
ఉదయం ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యుల ఎన్నికమధ్యాహ్నం అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక
ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి
సాగునీటి సంఘాలకు శనివారం ఎన్నికలు జరుగనున్నాయి. జిల్లావాప్తంగా ఉన్న 347 నీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెవెన్యూ, జలవనరుల శాఖకు చెందిన అధికారులను ఎన్నికల అధికారులుగా నియమించారు. ఎన్నికలు జరిగే ప్రాంతాలు, వేదికలపై ఇప్పటికే ఆయా సంఘాల పరిధిలోని ఓటర్లకు సమాచారం ఇచ్చారు. నిర్ణయించిన కేంద్రాల్లో ఉదయం ఎనిమిది గంటలకు ఎన్నిక నిర్వహించనున్నారు. తొలుత ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను (టిసి), రెండో పూట అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోనున్నారు. సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.సాగునీటి సంఘాలకు సాఫీగా ఎన్నికలు నిర్వహించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 347 నీటి వినియోగదారుల సంఘాల పరిధిలోని 2,667 ప్రాదేశిక నియోజకవర్గాలు (టిసి)కు ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలో 4.20 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 3.19 లక్షల మంది పురుష ఓటర్లు, 1.11 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. బూర్జ మండలం గుత్తావల్లి, కర్లకోట-1, కర్లకోట-2, తొగరాం సంఘాలు ఉన్నాయి. ఆమదాలవలసలో కొర్లకోట, దూసి, పొందూరు మండలం తాడివలస, పొన్నాం, పెనుబర్తి, కింతలి, బొడ్డేపల్లి, ఎచ్చెర్ల మండలంలో దుప్పలవలస, పూడివలస, పొన్నాడ, కొంగరాం, ధర్మవరం, కొత్తపేట, గార మండలం వాడాడ, శ్రీకూర్మం, అంపోలు, అంపోలు-2, శ్రీకాకుళం మండలంలో కళ్లేపల్లి, సింగుపురం, గూడెం, అరసవల్లి, బలగ రూరల్, జలుమూరు మండలం జలుమూరు, గుండువలస, నగరికటకం, కొమ్మనాపల్లి, తిమ్మడాం, గొటివాడ, నరసన్నపేట మండలం నడగాం, లుకలాం, ఉర్లాం, సత్యవరం, కోమర్తి, కిల్లాం, పోలాకి మండలం పోలాకి, ఈదులవలస, ఉర్జాం, మబగాం, యతియాబాసివలస, సంతబొమ్మాళి మండలం సంతబొమ్మాళి, గోవిందపురం, తాళ్లవలస, కోటబొమ్మాళి మండలం ఎలమంచిలి, గంగారం, నిమ్మాడ, హరిశ్చంద్రపురం, సంతబొమ్మాళి మండలం దండులక్ష్మీపురం, ఉమ్మిలాడ, రుంకు, మేఘవరం, డిజి పురం, హెచ్‌ఎన్‌పేట, హిరమండలం అంబావల్లి, టెక్కలి మండలం తిర్లంగి, రావివలస, బన్నువాడ, నందిగాం మండలం బూరగాం, వీరభద్రాపురం, పలాస మండలం లక్ష్మీపురం, అంతరకుడ్డ, సరుబుజ్జిలి మండలం సరుబుజ్జిలి, రొట్టవలస, యరగాం, పురుషోత్తపురం, ఎల్‌ఎన్‌పేట మండలం ఎల్‌ఎన్‌పేట, తెలికిపెంట సంఘాలు ఉన్నాయి. ఎన్నిక ప్రక్రియ సాగేదిలా…ఓటర్లు అయిన రైతులంతా కలిసి వాటర్ యూజర్స్ అసోసియేషన్ (డబ్ల్యుయుఎ) ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను ఎన్నుకుంటారు. సభ్యులను ఎన్నుకునేందుకు మూడు పద్ధతులను అనుసరించనున్నారు. సభ్యుల ఏకగ్రీవానికి అంగీకారం తీసుకుంటారు. ఏకగ్రీవం కాని పక్షంలో చేతులేత్తే పద్ధతిని అనుసరిస్తారు. ఏ అభ్యర్థికైతే మెజార్జీ సభ్యులు అంగీకారం తెలుపుతారో, వారు ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఈ సందర్భంగా ఇద్దరికీ సమాన ఓట్లు వస్తే రహస్య పద్ధతిలో ఓటింగ్ నిర్వహించున్నారు. ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల ఎన్నిక పూర్తయిన తర్వాత మధ్యాహ్నం పూట అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహించనున్నారు. ప్రతి కమిటీ నుంచి ఎన్నికైన సభ్యులంతా అందులో ఇద్దరిని అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నుకుంటారు.పోటీ కోసం తహతహప్రభుత్వం అధికారంలో ఉండడంతో కూటమి పార్టీలైన టిడిపి, జనసేన, బిజెపి నాయకులు సాగునీటి సంఘాల పదవులపై ఆసక్తి కనబరుస్తున్నారు. 2014-19 కాలంలో జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో కేవలం టిడిపి సానుభూతిపరులు మాత్రమే దక్కించుకోగా… ఇప్పుడు జనసేన, బిజెపి కూడా అందులో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాయి సాగునీటి సంఘాలకు రాజకీయ పార్టీలతో సంబంధం లేకపోయినా పదవులు దక్కించుకునేందుకు కూటమి నాయకులు పోటాపోటీ పయత్నాలు సాగిస్తున్నారు. మరోవైపు వైసిపి నాయకులూ పోటీకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం అధికారంలో ఉండడంతో పదవులు వస్తే ప్రాధాన్యం ఉంటుందని భావిస్తున్న నాయకులు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని ఏయే సంఘాలకు ఎవరెవరు అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఉండాలో మండల పార్టీ నాయకులకు ఎమ్మెల్యేలు సూచించినట్లు తెలిసింది.