నాడు తండ్రి… నేడు తనయుడు

కేంద్ర మంత్రిగా ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు

ప్రమాణస్వీకారం చేస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

  • కేంద్రమంత్రిగా రామ్మోహన్‌ నాయుడు ప్రమాణ స్వీకారం
  • జిల్లా నుంచి మూడో వ్యక్తి

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌, టెక్కలి

కేంద్ర మంత్రిగా ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టిడిపికి రెండు మంత్రి పదవులు లభించగా, అందులో కేబినెట్‌ హోదా ఉన్న మంత్రి పదవి రామ్మోహన్‌ నాయుడును వరించిన విషయం విదితమే. యువత, సామాజిక తరగతి, పార్టీ విధేయత వంటి సమీకరణాల నేపథ్యంలో రామ్మోహన్‌ నాయుడును ఈ పదవి వరించింది. రామ్మోహన్‌ నాయుడు తండ్రి కీర్తిశేషులు కింజరాపు ఎర్రన్నాయుడు యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఆయన తనయుడూ మంత్రి పదవి చేపట్టడంతో తండ్రీ తనయులిద్దరూ కేంద్రమంత్రులుగా పనిచేసిన రికార్డును సొంతం చేసుకున్నారు. జిల్లా నుంచి కేంద్రమంత్రులుగా ఇప్పటివరకు కీ.శే ఎర్రన్నాయుడు, కిల్లి కృపారాణి పనిచేయగా, ఆ జాబితాలో రామ్మోహన్‌ నాయుడు చోటు దక్కించుకున్నారు.శ్రీకాకుళం ఎంపీగా మూడుసార్లు గెలిచిన కింజరాపు రామ్మోహన్‌ నాయుడు డిసెంబర్‌ 18, 1987న కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో విజయలక్ష్మి, ఎర్రన్నాయుడు దంపతులకు జన్మించారు. ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో పాఠశాల విద్యనభ్యసించారు. ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యనభ్యసించారు. లాంగ్‌ ఐలాండ్‌ నుంచి ఎంబిఎ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీని అభ్యసించారు. 2012లో తన తండ్రి ఎర్రన్నాయుడు కారు ప్రమాదంలో మరణించడంతో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అనంతరం శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో సైకిల్‌యాత్ర చేపట్టి ప్రజలకు చేరువయ్యారు. 2014 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేఏసి 1.27 లక్షల మెజార్టీతో వైసిపి అభ్యర్థి రెడ్డి శాంతిపై విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెట్టారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసిపి ప్రభంజనంలోనూ ఆయన మరోసారి విజయం సాధించి తన పట్టును చాటుకున్నారు. తాజా ఎన్నికల్లో ఏకంగా 3.27 లక్షల మెజార్టీతో మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు. సమస్యలపై పూర్తి అవగాహన, అందరితో కలుపుగోలుగా ఉండడం, చొరవ, సమస్యలను లోక్‌సభలో ప్రస్తావించి రాష్ట్ర ప్రజల గొంతుకగా నిలవడం, తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. రైల్వే, హోం వ్యవహారాలు, పశుసంవర్థక, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ స్టాండింగ్‌ కమిటీల్లో సభ్యునిగా పనిచేశారు. పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వశాఖ సంప్రదింపుల కమిటీ, వెనుకబడిన తరగతుల సంక్షేమం, అధికార భాషా శాఖ కమిటీల్లో సభ్యునిగా పనిచేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా, 2020లో ఎంపీగా అతని పనితీరుకు సంసద్‌ రత్న అవార్డు లభించింది. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. జిల్లా ప్రజలకు కృతజ్ఞతలుకేంద్రమంత్రి వర్గంలో పనిచేసే అవకాశం దక్కినందుకు చాలా ఆనందంగా ఉందని రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ఈమేరకు ఎక్స్‌లో వీడియో సందేశం విడుదల చేశారు. ఈ ఆనందానికి కారణమైన శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిరంతరం తనకు మార్గనిర్దేశం చేస్తూ ప్రోత్సహిస్తున్న అధినాయకుడు చంద్రబాబు నాయుడు, సోదరభావంతో చూస్తున్న లోకేష్‌, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు బాబారు అచ్చెన్నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. కుటుంబ సభ్యులంతా ఎన్నో త్యాగాలు చేసి తాను మూడుసార్లు గెలవడానికి కారణమయ్యారని గుర్తుచేసుకున్నారు. తాను ఈ స్థాయిలో ఉండడానికి మరో ప్రధాన కారణం జిల్లా ప్రజలేనని, వారందరికీ పాదాభివందనాలు తెలియజేశారు. తెలుగు ప్రజలు, టిడిపి, జనసేన, బిజెపి కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి ఎన్‌డిఎ కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించారని చెప్పారు. నరేంద్ర మోడీ, చంద్రబాబు నేతృత్వంలో పనిచేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తెలుగు ప్రజలు ఏ కష్టాల్లో ఉన్నా వారి కోసం పనిచేశామన్నారు. వచ్చే ఐదేళ్లలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరుపున శక్తివంచన లేకుండా పనిచేసి అందరికీ న్యాయం చేయడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కష్టపడతామన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నిలిపి, దేశంలోనే అభివృద్ది చెందిన రాష్ట్రంలో తయారు చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు.

బయోడేటా

పేరు : కింజరాపు రామ్మోహన్‌ నాయుడు

తల్లిదండ్రులు : విజయలక్ష్మి, ఎర్రన్నాయుడు

జననం : 18 డిసెంబరు, 1987

స్వస్థలం : నిమ్మాడ, కోటబొమ్మాళి మండలం

భార్య : శ్రావ్య

కుమార్తె : నిహిరఅన్వి శివాంకృతివి

ద్యార్హత : బిటెక్‌, ఎంబిఎకు

టుంబ నేపథ్యం : తండ్రి కీ.శే కింజరాపు ఎర్రన్నాయుడు మూడుసార్లు శ్రీకాకుళం ఎంపీగా ఎన్నికయ్యారు. చిన్నాన్న కింజరాపు అచ్చెన్నాయుడు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు. సోదరి భవానీ రాజమండ్రి సిటీ మాజీ ఎమ్మెల్యే. భార్య శ్రావ్య తండ్రి బండారు సత్యనారాయణమూర్తి అనకాపల్లి జిల్లా మాడుగుల ఎమ్మెల్యే.రాజకీయ నేపథ్యం : తండ్రి కీ.శే కింజరాపు ఎర్రన్నాయుడు 2012లో మరణానంతరం రాజకీయరంగ ప్రవేశం. 2014, 2019, 2024 ఎన్నికల్లో శ్రీకాకుళం టిడిపి ఎంపీగా విజయం. పదవులు : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 16వ లోక్‌సభలో రైల్వే, హోం వ్యవహారాల స్టాండింగ్‌ కమిటీలు, పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వశాఖ సంప్రదింపుల కమిటీ, వెనుకబడిన తరగతుల సంక్షేమం, అధికార భాషా శాఖ కమిటీలో సభ్యుడు. ఆయన సేవలకు గుర్తింపుగా, 2020లో ఎంపీగా అతని పనితీరుకు సంసద్‌ రత్న అవార్డు లభించింది.

➡️