పలాస : మాట్లాడుతున్న డిఇఒ తిరుమల చైతన్య
ప్రజాశక్తి- పలాస
జిల్లాలో పాఠశాలన్నీ అభ్యసన కేంద్రాలుగా మార్చి పున:వ్యవస్థీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, అందులో భాగంగానే క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్‌లో ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య అన్నారు. కాశీబుగ్గ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన అభ్యసన శిక్షణలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుతం 235 స్కూల్ కాంప్లెక్స్ ఉండగా, వాటిని తగ్గించి 170 కస్టర్ కాంప్లెక్స్‌లుగా మార్పు చేశామన్నారు. సిఆర్‌ఎంటిల ఆధ్వర్యాన 9,391 మంది ఉపాధ్యాయులకు పున:వ్యవస్థీకరణపై శిక్షణ ఇస్తామన్నారు. గతంలో స్కూల్ కాంప్లెక్స్ పేరుతో రెండు, మూడు రోజులు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ప్రతి మూడో శనివారం మధ్యాహ్నం ఒక్కపూట మాత్రమే క్లాంపెక్స్ నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే చర్చల్లో పాత క్లాంప్లెక్స్, జిఒ నంబరు 117 రద్దు, వచ్చేయేడాది జూన్‌లో నిర్వహించనున్న అడ్మిషన్లు, డ్రాపౌట్లు, తరగతి గదుల్లో వెనుకబడిన విద్యార్థులకు స్టార్ కేటాయింపు వంటి అంశాలలపై క్లస్టర్ కాంప్లెక్స్ మాట్లాడేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌జిటి ఉపాధ్యాయులకు రెండు జామ కాయలను తెప్పించి నాలుగు భాగాలుగా విభజించి బోధిస్తూ… ఉపాధ్యాయుల అభ్యసన తీరు పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఇఒ సిహెచ్. శ్రీనివాసరావు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై.చిన్నం నాయుడు, సిఆర్‌పి శేషగిరి పాల్గొన్నారు. కవిటి: దిగువ శ్రేణి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి బోధన కొనసాగించాలని ఎంఇఒ ధనుంజరు మజ్జి సూచించారు. మండలంలోని బొరివంక, కవిటి, మాణిక్యపురం, బెలగాం, రాజపురం, ముత్యాలపేట పాఠశాలల్లో స్కూల్ కాంప్లెక్స్ నిర్వహించారు. జి.జానకిరావు, జగన్నాథ్ దోళై డిఆర్‌పిలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల ప్రగతి, సకాలంలో తరగతుల నిర్వహణ తదితర అంశాలపై శిక్షణ కల్పించారు. ో సిఆర్‌ఎంటి బి.తులసి, అబ్జర్వర్ ఎల్.కృష్ణ పాల్గొన్నారు. సంతబొమ్మాళి: ఉపాధ్యాయులు తమ విజ్ఞానాన్ని పంచుకునే వేదికలుగా పాఠశాల సముదాయ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని బోరుభద్ర స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్ పి.రామకృష్ణ అన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బోరుభద్ర పరిధిలోకి వచ్చే అన్ని పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయుల సముదాయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు భాస్కరరావు, ధనుంజయరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.టెక్కలి : క్లస్టర్ సముదాయాల్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంఇఒ దాసుపురం చిన్నారావు కోరారు. మండలంలో నర్సింగపల్లి, చాకిపల్లి పాఠశాలల్లో నిర్వహిస్తున్న క్లస్టర్ సముదాయాలను పరిశీలించారు. ఇచ్ఛాపురం : క్లస్టర్ సముదాయాలను ఎంఇఒ-2 విశ్వనాథం పరిశీలించారు. మండలంలోని స్థానిక బాలికల, పురుషోత్త పురం, రత్తకన్న, కొలిగాం, ఈదుపురం, లొద్దపుట్టి, డొంకూరు పాఠశాలల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు.