ప్రయాణ అవస్థలు

ప్రధాని నరేంద్ర మోడీ

కాశీబుగ్గ కాంప్లెక్స్‌లో బస్సుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు

  • పండగ వేళ బస్సుల్లేక ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు
  • ప్రధాని మోడీ సభకు 235 ఆర్‌టిసి బస్సుల తరలింపు
  • కిక్కిరిసిన బస్సుల్లో ప్రయాణిస్తూ అవస్థలు
  • బస్సుల్లేని రూట్లలో ప్రయివేట్‌ వాహనాలే దిక్కు

కూటమి ప్రభుత్వంలో జగన్‌ పాలన మాదిరి పరదాలు ఉండవు… జనం తరలింపు ఉండదు. గేట్లు దాటి వెళ్లిపోవడలూ ఉండవంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా కూటమి నేతలు పదేపదే చెప్పారు. ప్రజలు నిజమే కాబోలు అని అనుకున్నారు. బస్సు తరలింపుతో ప్రయాణ ఇబ్బందులు, ట్రాఫిక్‌ మళ్లింపులు, గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడం వంటివి తప్పుతాయని అంతా భావించారు. నీతులు చెప్పిన నేతలే తామేమీ తక్కువ తినలేదన్నట్లుగా విశాఖలో నిర్వహించిన మోడీ సభకు వందలాది ఆర్‌టిసి బస్సుల్లో జనాలను తరలించారు. జనాలకు కష్టాలను మిగిల్చారు. పండగ వేళ బస్సుల్లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి, పలాస

ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనను టిడిపి కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభకు లక్ష మందిని తరలించి తన సత్తా చాటాలని భావించింది. విశాఖకు సమీపంలో ఉన్న జిల్లాల నుంచి ప్రజలను తరలించి విజయవంతం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆర్‌టిసి బస్సులను అధిక సంఖ్యలో వినియోగించుకుంది. జిల్లాలో 340 ఆర్‌టిసి బస్సులు ఉంటే ఏకంగా 235 బస్సులను విశాఖకు పంపారు. జిల్లాలో నాలుగు డిపోలు ఉండగా శ్రీకాకుళం-1, 2 డిపోల నుంచి 140 బస్సులు, పలాస నుంచి 50, టెక్కలి నుంచి 45 బస్సులు చొప్పున పంపారు. దాదాపు 70 బస్సులను తరలించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా పల్లె వెలుగు బస్సులను అధిక శాతం పంపడంతో గ్రామీణ ప్రాంతాలకు అరకొరగా బస్సులు తిరిగాయి. శ్రీకాకుళం-1, 2 డిపోల పరిధిలో బత్తిలి, కొత్తూరు, పాతపట్నం, చీపురుపల్లి, రాజాం, సాలూరు వంటి ముఖ్యమైన ప్రాంతాలతో పాటు మారుమూల గ్రామాలకు అరకొరగా బస్సులు నడిచాయి. పలాస డిపో పరిధిలో ఇచ్ఛాపురం నుంచి విశాఖపట్నం రూట్‌లో పూర్తిగా బస్సులను నిలిపివేశారు. కొత్తూరు రూట్‌లో ఏడు బస్సులు తిరగాల్సి ఉండగా, ఒక బస్సు మాత్రమే తిరిగింది. పలాస నుంచి మందసకు ఏడు బస్సులు తిరగాల్సి ఉండగా, ఒక బస్సు మాత్రమే నడిచింది. పలాస నుంచి శ్రీకాకుళం వరకు పల్లె వెలుగు బస్సులు ఏడూ తిరగాల్సి ఉండగా, కేవలం మూడు మాత్రమే తిరిగాయి. పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు పల్లె వెలుగు బస్సులు ఐదు తిరగాల్సి ఉండగా, ఒకటి మాత్రమే తిరిగింది. కవిటి, ఇచ్ఛాపురం, పొత్తంగి, గాటి గంగాధరపురం గ్రామాలకు పూర్తిగా బస్సులు నిలిపివేశారు. బ్రాహ్మణతర్లా, టెక్కలిపట్నం, గొప్పిలి, రెంటికోట, లొద్దభద్ర తదితర రూట్లలో వెళ్లాల్సిన బస్సులను సభకు మళ్లించారు.

బస్సుల తరలింపుతో ప్రయాణికుల పాట్లు

జిల్లా నుంచి 70 శాతం బస్సులను మళ్లించడంతో ప్రయాణికులు పడరాని పాట్లు పడ్డారు. పండగ సీజన్‌ కావడంతో వస్త్రాలు, సరుకుల కొనుగోలుకు పట్టణాలకు వచ్చిన ప్రజలు సమయానికి బస్సుల్లేక ఇబ్బందులు పడ్డారు. బస్సుల కోసం ఆర్‌టిసి కాంప్లెక్స్‌ల వద్ద గంటల తరబడి నిరీక్షించారు. బస్సులు కిక్కిరిసిపోవడంతో మహిళలు, చిన్నారులు, వృద్ధులు అవస్థలు పడ్డారు. శ్రీకాకుళం నగరం, నరసన్నపేట, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో ఆటోలు, మ్యాక్సీ కేబ్‌లను ఆశ్రయించారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఆటోల్లో తమ ఇళ్లకు చేరారు.

సభకు వెళ్లేందుకు ఆసక్తి చూపని జనం

విశాఖలో నిర్వహిస్తున్న ప్రధాని మోడీ సభకు వెళ్లేందుకు జనం పెద్దగా ఆసక్తిగా చూపలేదు. జిల్లాలోని అన్ని డిపోల నుంచి బస్సులు వేసినా ఒక్కో బస్సుకు 25 నుంచి 30 మంది వరకు మాత్రమే ఎక్కినట్లు తెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ధాన్యం అమ్మకాలు, నూర్పులు ఉండడంతో రైతులు తాము వెళ్లేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. పండగ సమయం కావడంతో మహిళలూ విముఖత ప్రదర్శించారు. జనాల తరలింపును టిడిపి నేతలు అంత సీరియస్‌గా తీసుకోలేదని తెలుస్తోంది. దీంతో అధిక శాతం బస్సులు కొద్దిమందితోనే విశాఖకు వెళ్లాయి.

ఆర్‌టిసి సిబ్బందికీ ఇబ్బందే

బస్సుల సంఖ్య విషయంలో అధికారుల్లో స్పష్టత కరువవడంతో ఆర్‌టిసి సిబ్బంది ఇబ్బంది పడ్డారు. ఏ రూట్‌లో ఎన్ని బస్సులు పంపాలో చివరివరకు తెలియకపోవడంతో, కొంత గందరగోళం చోటుచేసుకున్నట్లు తెలిసింది. బస్సులను సిద్ధం చేసినా డ్రైవర్లను గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి. రాత్రి ఒంటి గంటకే బస్సుల వద్ద ఉండాలని అధికారులు ఆదేశించడంతో డ్రైవర్లు పడిగాపులు కాస్తూ అవస్థలు పడ్డారు. వేకువజామున జనాలను ఎక్కించుకుని వారు బయలుదేరారు. వారిని పర్యవేక్షిస్తూ అధికారులూ జాగారం చేయాల్సి వచ్చింది. జిల్లా ప్రజా రవాణా అధికారి ఎ.విజరుకుమార్‌తో పాటు అన్ని డిపోల మేనేజర్లూ బస్సులు తిరిగి తమ డిపోలకు చేరే వరకు విశాఖలోనే ఉన్నారు. వారంతా అర్ధరాత్రి వరకు పర్యవేక్షించారు.

 

➡️