మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు
- ఇచ్చిన హామీని అమలు చేయాలి
- రేపు నిరసన కార్యక్రమాలు
- సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు
ప్రజాశక్తి – సోంపేట
ఇసుకను ఉచితంగా ఇస్తామంటూ ఇచ్చిన హామీని తక్షణం అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.మోహనరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌తో ఈనెల నాలుగో తేదీన నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. సోంపేటలో బుధవారం నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇసుక లభించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, అందరికీ ఇసుక అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. అవినీతిని అరికట్టి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి చూపాలని, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించాలని కోరారు. భవన నిర్మాణాలు చేసుకునే వారిపై అధిక భారం లేకుండా చూడాలన్నారు. గత ప్రభుత్వ కాలంలో ఇసుక లభించకపోవడం, రేట్లు పెరిగిపోవడం, విచ్చలవిడి అవినీతి వల్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడిందని గుర్తుచేశారు. అనేక కారణాలతో పాటు ఇసుక సమస్యపై ఆగ్రహంతోనూ వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దించారని చెప్పారు. ఉచితంగా ఇసుక ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. వంద రోజుల పాలనలో ఇసుక విషయంలో గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా లేకుండా పోయిందని విమర్శించారు. అనేకచోట్ల ఇసుక లభించడం లేదని, రవాణా ఛార్జీలు, ఇతర పేర్లు చెప్పి ఇసుక రేట్లు తగ్గించలేదని తెలిపారు. కొన్నిచోట్ల మరింత పెరిగాయని, ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోందని విమర్శించారు. ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతలు పలుచోట్ల ఇసుకపై పెత్తనం చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి పదేపదే బహిరంగంగా హెచ్చరిస్తున్నా పరిస్థితిలో మార్పు రాలేదని తెలిపారు. ఇసుక కొరత, అధిక రేట్ల వల్ల భవన నిర్మాణరంగం ఇబ్బందులు ఎదుర్కొంటోందని, నిర్మాణ కార్మికులకు ఉపాధి కొరవడుతోందన్నారు. ఇళ్ల నిర్మాణాలు చేసుకునే చిన్న, మధ్యతరగతి వర్గాలపై భారం పడుతోందని వివరించారు. ఇసుక ఆన్‌లైన్ విధానం ప్రవేశపెడుతున్నామని ప్రకటించినా ఆచరణలో పొంతన లేదని విమర్శించారు. చెప్పిన ధరల్లో తీవ్ర వ్యత్యాసం కనబడుతోందని తెలిపారు. పార్టీ నాయకులు జుత్తు సింహాచలం అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మండల కన్వీనర్ ఎస్.లకీëనారాయణ, కె.సింహాచలం, టి.పాపారావు, చిన్నబాబు, రామారావు తదితరులు పాల్గొన్నారు.