నిరాహార దీక్షా శిబిరంలో అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు
- కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కేంద్రం కుట్ర
- అఖిలపక్ష కార్మిక సంఘాల రిలే నిరాహార దీక్ష
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
ఆంధ్రుల ఆత్మబలిదానాలతో సాధించిన విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని, లేకుంటే ఐక్య ఉద్యమాలను ఉధృతం చేస్తామని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ ఆపాలని, సెయిల్‌లో విలీనం చేసి పరిరక్షించాలని కోరుతూ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యాన స్థానిక ఏడురోడ్ల కూడలి వద్ద మంగళవారం రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు ప్రారంభించారు. ప్రజానాట్యమండలి కళాకారులు చింతాడ రామచంద్రరావు, ఎస్.శ్రీనివాస్ గీతాలను ఆలపిస్తూ పోరాటానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ బిజెపి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ పరిస్థితి రోజురోజుకీ దిగజారిందన్నారు. మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌ల్లో రెండు మూతపడగా విశాఖ స్టీల్ ఉత్పత్తి సామర్థ్యం సాలీనా 73 లక్షల టన్నులు ఉండగా, గతేడాది 45 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోనే నాణ్యమైన విశాఖ స్టీల్‌కు డిమాండ్ ఉన్నా కావాలనే ఉత్పత్తి తగ్గించి కేంద్ర ప్రభుత్వం నష్టాల్లోకి నెట్టి ప్రైవేట్‌కు అప్పగించాలని కుట్ర చేస్తోందని విమర్శించారు. దేశంలో అన్ని స్టీల్‌ప్లాంట్లకు సొంత గనులున్నా, ఒక్క విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు మాత్రమే సొంత గనుల్లేవన్నారు. సొంత గనులున్నా ప్రైవేట్, ప్రభుత్వ కంపెనీలు ఇనుప ఖనిజం తవ్వి తీసుకోవడానికి టన్నుకు రూ.500 మాత్రమే ఖర్చవుతుందని, విశాఖ స్టీల్‌ప్లాంట్ ఇనుప ఖనిజం టన్ను రూ.5,940 పెట్టి మార్కెట్‌లో కొనాల్సి వస్తోందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించిన కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ దేశంలోనే అత్యుత్తమైందని కొనియాడారని గుర్తుచేశారు. 45 రోజుల్లో విశాఖ ఉక్కును రక్షించేందుకు ప్రణాళికతో ప్రధాని మోడీని ఒప్పించి పూర్తి సామర్థ్యంతో నడిపిస్తామని ప్రకటించారని, ప్లాంట్ పరిరక్షణకు చర్యలు చేపట్టకపోగా నాశనం చేయడానికి అన్ని ప్రయత్నాలు ముమ్మరం చేసిందని విమర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వ పెట్టుబడి కేవలం రూ.ఐదు వేల కోట్లు మాత్రమేనని… ఇప్పటివరకు పన్నులు, డివిడెండ్ల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.58 వేల కోట్లు పైగా విశాఖ ఉక్కు చెల్లించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టి ప్రత్యేక హోదా లేకుండా చేసి, ఉన్న ఏకైక భారీ పరిశ్రమను అదానీ, అంబానీ, పోస్కో వంటి స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు కారుచౌకగా కట్టబెట్టాలనే కుట్ర ఏం దేశభక్తో అర్థం కావడం లేదన్నారు. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిందని, టిడిపి ప్రభుత్వ మద్దతుతోనే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం నడుస్తున్నా ఎందుకు కాపాడలేకపోతుందని ప్రశ్నించారు. టిడిపి, జనసేన బిజెపిపై ఒత్తిడి తెచ్చి ఆంధ్రప్రదేశ్‌కు మణిహారమైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటంలో కవులు, రచయితలు, ప్రజాస్వామికవాదులు, ప్రజలు కలసి రావాలని పిలుపునిచ్చారు. దీక్షల్లో సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.షణ్ముఖరావు, చిక్కాల గోవిందరావు, వైఎస్‌ఆర్‌టియు జిల్లా ఉపాధ్యక్షులు రౌతు శంకరరావు, ఎస్.వెంకటరావు, సాహితీ స్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసు, స్టీల్‌ప్లాంట్ యూనియన్ నాయకులు కూన వెంకటరావు, సిఐటియు జిల్లా నాయకులు బి.కృష్ణమూర్తి, ఎ.మహాలక్ష్మి, ఎన్.వి.రమణ, ఎం.ఆదినారాయణ మూర్తి, పలు యూనియన్ల నాయకులు పాల్గొన్నారు.